సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్‌ చిత్రంతో మొన్న సంక్రాంతికు మన హీరోల కన్నా ముందే వచ్చేసాడు. తెలుగులోనూ చాలా కాలం తర్వాత మంచి ఓపినింగ్స్ తెచ్చుకున్న రజనీ సినిమా ఇది. గతంలో వచ్చిన ‘కాలా’ ‘పేట’ సినిమాల సక్సెస్ కేవలం ట్రైలర్లు కే పరిమితం అయ్యింది. అయితే ఈ సారి డైరెక్టర్ మురగదాస్ దర్బార్  రజనీ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అందించాడని రివ్యూలు వచ్చాయి. వింటేజ్ లుక్‌లో రజనీ లుక్స్, మేనరిజమ్స్ సాధారణ ఆడియెన్స్‌ను సైతం సర్‌ప్రైజ్ చేసినా ఫలితం లేదు. తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర సింహనాదం చేసిన తలైవా ఆ తర్వాత బోరుమన్నాడు. 

పోటీగా సినిమాలేవీ లేకపోవడంతో సౌత్ అంతా సాలిడ్ ప్రదర్శన ఇచ్చాడని అర్దమైంది.   తెలుగు సూపర్ స్టార్స్ నటించిన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో... చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఇవి రెండు స్ట్రెయిట్ సినిమాలు కావటంతో వీటికి బ్రహ్మరథం పట్టారు తెలుగు జనం. ఆ ఇంపాక్ట్ దర్బార్ కలెక్షన్స్ పై పడటం మొదలైంది. ఈ నేపధ్యంలో సర్లే టీవీల్లో చూసుకుందాంలే అని సైడ్ అయ్యిపోయిందీ సినిమా. ఇప్పుడు అన్ని భాషల టీవీ ఛానెల్స్ లోనూ ఈ సినిమా ప్రీమియర్ షోలు వేసారు. అయితే ఎక్కడా ఊపు లేదు. 

 తెలుగు వెర్షన్ అయితే మరీ తీసికట్టు. తెలుగులో దర్బార్ కు 6.97 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ప్రీమియర్ షోకు ఈ రేటింగ్ అంటే దారుణం అని చెప్పాలి. పేట సినిమా ప్రీమియర్ షోకు 10 వస్తే, రోబో 2, కబాలి చిత్రాలకు 15 దాటి టీఆర్పీ వచ్చింది. ఇంకా చెప్పాలంటే సుడిగాలి సుధీర్ నటించిన సాప్ట్ వేర్ సుధీర్ రీసెంట్ గా టీవీల్లో వేసారు. దానికన్నా తక్కువ టీఆర్పీ దర్బార్ కు రావటం షాక్ ఇచ్చింది. ఇదేంటిది తెలుగోళ్లు రజనీని ఇంతలా ప్రక్కన పెట్టేసారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. 
 
ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో... నయనతార హీరోయిన్ గా చేసిన ఈ చిత్రంలో  బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రల్లో నటించారు.  లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్వీ ప్రసాద్‌ విడుదల చేసారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం విడుదల అయ్యింది. రజనీ కుమార్తెగా నివేదా థామస్.. ఇతర కీలక పాత్రల్లో తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు.