సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోపై అత్యాచార ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన ఓ మోడల్.. రొనాల్డోపై అత్యాచార ఆరోపణలు చేసింది. పదేళ్ల క్రితం రొనాల్డో తనను అత్యాచారం చేశాడని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై విచారణ సాగుతోంది.

ఈ వ్యవహారానికి సంబంధించి కొన్ని రోజులుగా కొన్ని పుకార్లు షికారు  చేస్తున్నాయి. మయోర్గా అనే ఆ మోడల్ కు అప్పట్లోనే రొనాల్డో భారీగా డబ్బులు ఇచ్చి వ్యవహారాన్ని సెటిల్ చేసుకున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఆ విషయాన్ని రొనాల్డో ఖండిస్తూ వచ్చాడు. అయితే తాజాగా రొనాల్డో లాయర్లు ఆ విషయాన్ని ధ్రువీకరించారు. 

ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.2.75 కోట్లను రొనాల్డో సదరు మోడల్ కి చెల్లించి ఆమెతో వ్యవహారాన్ని సెటిల్ చేసుకున్నాడని.. అయితే అది నేరాన్ని ఒప్పుకోవడం కాదని అంటున్నారు.

మోడల్ చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేనప్పటికీ బహిరంగ ఆరోపణలు చేయకుండా రొనాల్డో ఆమెకి డబ్బు ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడని లాయర్లు అంటున్నారు. అంత భారీ మొత్తాన్ని తీసుకొని కూడా ఆమె ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని లాయర్లు కోర్టుకి తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు విషయంలో రొనాల్డో చాలా ఇబ్బందులు పడుతున్నాడు!