బాలీవుడ్‌ సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ ప్రకటించటంతో దాదాపు మూడు నెలలుగా ఇండస్ట్రీ అంతా స్థంబించిపోయింది. అయితే ఈ సమయంలో వరుస మరణాలు బాలీవుడ్ పరిశ్రమను కలవరపెడుతున్నాయి. అదే సమయంలో ఇండస్ట్రీలో వరుసగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తుండటం కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ఆంధోళన కలిగిస్తోంది.

తాజాగా మరో విషాదం బాలీవుడ్‌ ఇండస్ట్రీని కుదిపేసింది. ఈ రోజు ఉదయం అమితాబ్ కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌ అంటూ వార్తలు రావటంతో అభిమానులు షాక్‌ అయ్యారు. ఆ షాక్‌ నుంచి తేరుకోకముందే మరో వార్త కుదిపేసింది. ప్రముఖ సినీ, టెలివిజన్‌ నటుడు రాజన్‌ సెహగల్‌ శనివారం మృతి చెందినట్టుగా ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 36 ఏళ్ల రాజన్‌.. ఛండీఘడ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

ఆయన మృతికి పలువురు సినీ, టీవీ సెలబ్రిటీలతో పాటు సినీ అండ్‌ టీవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించింది. రాజన్‌.. ఐశ్వర్యరాయ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సరబ్జిత్‌ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఆ సినిమాతో పాటు ఫోర్స్‌, కర్మ లాంటి సినిమాలో కీలక పాత్రల్లో నటించాడు. బుల్లితెరమీద క్రైమ్ పెట్రోల్‌, సావధాన్ ఇండియా లాంటి సూపర్‌ హిట్ షోస్‌లో నటించాడు.