కంటికి కనిపించని కరోనా వైరస్ విజృంభణతో అన్ని రంగాలు కుదేలు అయ్యిపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ కు సీజన్ గా మారే వేసవి మొత్తం ఒక్కసారిగా డల్ అయ్యిపోయింది. ముఖ్యంగా భారీగా పెట్టుబడులు పెట్టే పరిశ్రమలు, సినిమావాళ్లు మాత్రం ఓ రేంజిలో సఫర్ అవుతున్నారు. తాము ఇంక ఈ నష్టాలు నుంచి కోలుకోగలమా అన్నట్లు  దీనంగా చూస్తున్నారు. తెలుగులో పెద్ద సినిమాలు షూటింగ్ స్దాయిలోనే చాలా వరకూ ఆగాయి కాబట్టి పెద్దగా నష్టం కనపడటం లేదు. కానీ బాలీవుడ్ పరిస్దితి అలా కాదు. అక్కడ రిలీజ్ కు సిద్దమైన రెండు పెద్ద సినిమాల పరిస్దితి దారుణంగా ఉంది.ఆ సినిమాలు మరేవో కాదు..సూర్య‌వంశీ, 1983. 

ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ వేసవిలో ఈ రెండు సినిమాలు రిలీజ్ అవ్వాలి. కానీ ఇప్పుడా పరిస్దితి అసలు కనపడటం లేదు. ఆ రెండు సినిమాలపై పెట్టిన పెట్టుబడి మామూలుగా లేదు. రిలీజ్ లేటైతే రకరకాల నష్టాలు. ముఖ్యంగా ప్రాజెక్టుపై క్రేజ్ తగ్గిపోతుంది. మళ్లీ కొత్తగా పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంతేకాదు ఈ సినిమా నిర్మాణం కోసం తెచ్చిన ఫైనాన్స్ లకు వడ్డీలు కట్టడం కష్టమవుతుంది. అలాగే మిగతా సినిమాల రిలీజ్ డేట్స్ కూడా డిస్ట్రబ్ అవటం జరుగుతుంది. ఇలా వ్యవస్ద మొత్తం చెల్లా చెదురు అవుతుంది.

సూర్య‌వంశీ విష‌యానికి వ‌స్తే..  అక్ష‌య్ కుమార్ హీరోగా సూర్య‌వంశీ రూపొందింది. ఆ సినిమాలో అజ‌య్ దేవ‌గ‌ణ్, ర‌ణ్ వీర్ లు గెస్ట్ లుగా కనపడనున్నారు. అలాగే ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల అయిన‌ప్పుడు  పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. దాంతో ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని అందరూ లెక్కలేసారు. డిస్ట్రిబ్యూటర్స్ సైతం ఈ సినిమా రిలీజ్ కోసం అడ్వాన్స్ లు ఇచ్చి ఎదురుచూస్తున్నారు.

మరో ప్రక్క 1983 చిత్రం విషయానికి వస్తే..ఆ సంవత్సరం లో క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ నెగ్గిన టీమిండియా విజ‌య‌యాత్ర గురించి రూపొందించారు. క్రికెట్ కు సంభందించిన సినిమా కావటంతో.. ఈ వేసవిమంచి వ‌సూళ్ల‌కు అవ‌కాశం ఉంద‌ని అంచనా వేసారు. దాంతో ఈ సినిమా రిలీజ్ లేకపోవటంతో భారీగానే దెబ్బ తగిలినట్లు అంచనా వేస్తున్నారు. 

బాలీవుడ్ లో చివ‌ర‌గా విడుద‌ల అయిన బాలీవుడ్ సినిమా 'అంగ్రేజీ మీడియం'. అది రిలీజ్ అయ్యిందన్నమాటే కాని,ఆ తెల్లారే లాక్ డౌన్ కావటంతో ఆడింది లేదు. అయితే చిన్న సినిమా కావటంతో థియోటర్ రిలీజ్ ప్రక్కన పెట్టినా డిజిటల్ రైట్స్ విషయంలో సొమ్ము చేసుకుంటుందని భావిస్తన్నారు. కాకపోతే అప్పటికి డిజటల్ రైట్స్ అమ్మకపోతేనే కలిసి వస్తుంది.  

ఏదైమైనా ఏప్రిల్ నెలాఖరకు కూడా సినిమాల విడుద‌ల లేన‌ట్టే అని తేలుస్తున్నారు. ఈ క్ర‌మంలో రిలీజ్ వాయిదాతో, వ‌డ్డీలు పెరిగిపోయి.. ఈ రెండు భారీ సినిమాలూ న‌ష్టాల‌ను ఎదుర్కొంటున్నాయ‌ని ట్రేడ్ లో అంచనా వేస్తున్నారు.