యావ‌త్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా వైరస్‌ను త‌రిమి కొట్టేందుకు అన్ని దేశాలు నివార‌ణ చ‌ర్య‌లను పటిష్టంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.. లాక్ డౌన్ విధించి ఎక్క‌డి ప్ర‌జ‌ల‌ను అక్క‌డే నిలిపి వేశారు. దాంతో సాధారణ జనం నానా బాధలు పడుతున్నారు. సినిమాల్లో చిన్న స్దాయి వారు, రోజూ వారి పనులుకు వెళ్లి సంపాదించుకునేవారు సైతం ఇబ్బందులకు లోనవుతున్నారు. దాంతో సెలబ్రెటీలు ముందుకు వచ్చి తమకు చేతనైన సాయిం చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి ఇప్పటికే హీరోలంంతా తమదైన సాయిం అందించారు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సైతం ..నేను సైతం అంటూ ముందుకు వచ్చారు.  కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తన ఛారిటీ సంస్థ బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ ద్వారా సినీ కార్మికులను ఆదుకునేందుకు సిద్ధమయ్యారు.

బాలీవడ్ షట్ డౌన్ కావడంతో ఐదు లక్షల మంది కార్మికులకు ఉపాధి నిలిచిపోయింది. వారిలో 25 వేల మందికి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకున్న సల్మాన్ ఖాన్ తన బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ ను రంగంలోకి దింపారు. బీయింగ్ హ్యూమన్ ప్రతినిధులు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయీస్ (ఎఫ్ డబ్ల్యూఐసీఈ) కార్యాలయానికి వచ్చి ఆ పాతికవేల మంది కార్మికుల బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకున్నారు. వారి ఖాతాల్లోకి నేరుగా డబ్బు బదిలీ చేయాలన్నది సల్మాన్ ఆలోచన. ఆ పాతికవేల మంది యోగక్షేమాలు లాక్ డౌన్ ఉన్నన్నాళ్లు బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ చూసుకోనుంది. 

ఇక  స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్న తాజా చిత్రం రాధే షూటింగ్.. ఈ నెల చివ‌రి వ‌ర‌కు జ‌ర‌గాల్సి ఉంది. అయితే దేశంలో క‌రోనా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో రాధే షూటింగ్ వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. దీంతో స‌ల్మాన్ కుటుంబంతో క‌లిసి తాను ఎక్కువగా ఇష్ట‌ప‌డే ఫామ్‌హౌజ్‌కు మ‌కాం మార్చాడు. సోద‌రి అర్పితా ఖాన్‌, ఆమె భ‌ర్త ఆయుష్ శ‌ర్మ‌, అల్లుడు అహిల్‌, మేన‌కోడ‌లు అయాత్‌తో క‌లిసి ప‌న్వెల్‌లోని ఫామ్‌హౌజ్‌లో స‌రదాగా గ‌డుపుతున్నారు. 

 ఆ ఫామ్ హౌజ్‌లో అన్ని సౌక‌ర్యాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. సాధార‌ణంగా స‌ల్మాన్ ఆ ఫామ్‌హౌజ్‌లో త‌న పుట్టిన రోజులు వేడుక‌లు జ‌రుపుకుంటాడు. ఇటీవ‌లే  స‌ల్మాన్ అల్లుడు అహిల్‌తో క‌లిసి ఆ ఫామ్ హౌజ్‌లో తిరుగుతున్న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకున్నాడు. ఈ రంజాన్ పండక్కి విడుదల కావాల్సిన సల్మాన్ ఖాన్ ‘రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌’ సినిమా రిలీజ్‌ కూడా వాయిదా పడుతుందనే వార్తలు బాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు.