కరోన మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్‌ కారణం అన్ని రంగాలు కుదేళవుతున్నాయి. ముఖ్యంగా వినోద రంగం తీవ్రంగా దెబ్బతింది. సినిమాలు, సీరియల్స్‌కు సంబంధించిన షూటింగ్‌లు చాలా కాలంగా ఆగిపోవటం, తిరిగి ప్రారంభమైనా ఎక్కువ మంది షూటింగ్‌లో పాల్గొనే అవకాశం లేకపోవటంతో చాలా మంది ఉపాది కోల్పోయారు. దీంతో అవకాశాలు లేని నటీనటులు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు.

కొద్ది రోజుల క్రితం పూట గడవని పరిస్థితుల్లో ఇద్దరు తమిళ సీరియల్‌ ఆర్టిస్ట్‌లు తమ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి వార్తే మరొకటి తెర మీదకు వచ్చింది. తమిళ టెలివిజన్‌ సీరియల్స్‌లో నటిగా కొనసాగుతున్న సుచిత్ర అనే మహిళ కరోన సమస్యల కారణంగా ఆర్థిక కష్టాలు ఎదురుకావటంతో దొంగగా మారింది. సుచిత్ర కొద్ది రోజులుగా మణికందన్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది.

అతను సినీ నటులకు డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అయితే సుచిత్రకు అవకాశాలు లేకపోవటంతో డబ్బుకు చాలా ఇబ్బందిగా మారింది. దీంతో మణికందన్‌ను దొంగతనం చేసేందుకు ప్రేరేపించింది. ఇద్దరు కలిసి మణికదంన్‌ ఇంట్లోనే దొంగతనం చేయడానికి ప్లాన్ చేశారు. అనుకున్నట్టుగా మణికందన్ తల్లిదండ్రులు దాచుకున్న 50 వేల రూపాయల క్యాష్, 18 సవర్ల బంగారం చోరి చేశాడు. మణికందన్ తల్లిదండ్రులు పోలీస్‌ కంప్లయింట్ ఇవ్వటంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇప్పిటకే మణికందన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, సుచిత్ర ప్రస్తుతం పరారీలో ఉంది.