కరోనా కాలంలో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. సోనూ సూద్‌ లాంటి వారు దేశ వ్యాప్తంగా సమస్య ఎక్కడ ఉంటే అక్కడి వెళ్లి సాయం చేస్తుంటే చిన్న చిన్న తారలు కూడా తమ వంతు సాయం అందిస్తున్నారు. ఈ లిస్ట్ కమెడియన్‌, హీరో షకలక శంకర్‌ కూడా చేశాడు.  ఇటీవల తన 'నటనార్జితం' నుంచి లక్షా పది వేలు వెచ్చించి... ఇటీవల ఓ రైతు కూలీ కుటుంబానికి కాడెద్దులు-నాగలి బహూకరించాడు శంకర్.

తాజాగా కరోనా కారణంగా కకావికలమైన ఏడు కుటుంబాలను ఆదుకున్నారు. ఇందుకోసం ఆయన కరీంనగర్ వీధుల్లో భిక్షాటన చేపట్టారు. దీని ద్వారా సుమారు 90 వేలు సమకూరగా... మిగిలిన డబ్బులు తను జోడించి... మొత్తం లక్ష రూపాయలతో... కరీంనగర్ లోని ఏడు కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించారు.

ఈ సేవా కార్యక్రమం తాను చేపట్టేలా ప్రేరేపించి... అందుకు తనకు సహకరించిన కరీంనగర్ 'విందు భోజనం' మహేంద్ర, వెంకట్ రెడ్డి, గోపాల్ రెడ్డి, బిటిఆర్ లకు శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. నెలకొక పర్యాయం ఇలాంటి సేవా కార్యక్రమం చేయలనుకుంటున్నానని, అందుకు ఆ సర్వేశ్వరుడి అనుగ్రహం వేడుకుంటున్నానని శంకర్ పేర్కొన్నారు!!