త్వరలో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ పుట్టిన రోజు రానుంది. ఈ సందర్భంగా ఇప్పటి నుంచే సందడి మొదలు పెట్టేశారు ఫ్యాన్స్‌. జూలై 13న అడ్వాన్స్‌ బర్త్‌ డే విషెస్‌ అంటూ సోషల్ మీడియాను హోరెత్తించారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు కూడా పవన్‌కు అడ్వాన్స్‌ బర్త్‌ డే విషెస్‌ తెలియజేశారు. ఈ లిస్ట్ లో పవన్‌ మాజీ స్నేహితుడు అలీ కూడా ఉన్నాడు.`వ్యక్తిత్వంలో నిన్ను ఓడించలేనప్పుడు నీ కులం గుణం వర్ణం గురించి మాట్లాడుతారు... ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా చెదరని నీ నవ్వుకి నీ సహనానికి శిరస్సు వంచి నమస్కారాలు పవన్ కల్యాణ్` అంటూ ట్వీట్ చేశాడు.

అయితే ఈ ట్వీట్ విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలీ ఇదే ట్వీట్‌ ఎన్నికలకు ముందు చేసి ఉంటే అభిమానులు పండుగ చేసుకునేవారు. కానీ ఎన్నికల సమయంలో ఈ ఇద్దరు స్నేహితుల మధ్య దూరం పెరిగింది. ఒకరి మీద ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకోవటంతో పవన్ అభిమానులు అలీ మీద గుర్రుగా ఉన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్‌గా లేకపోయినా అలీ, వైఎస్సార్‌సీపీ పార్టీలో ఉన్నాడు. పవన్‌ ప్రతీ విషయంలో వైసీపీని తప్పుబడుతున్నాడు.

దీంతో అభిమానుల్లోనూ అలీ మీద కొంత వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతే అలీ ట్వీట్ విషయంలో కూడా కనిపిస్తోంది. అలీ, పవన్‌ను పొగుడుతూ ట్వీట్ చేసినీ అభిమానులు మాత్రం దాన్ని పాజిటివ్‌గా రిసీవ్‌ చేసుకోలేకపోతున్నారు. అంతేకాదు అలీ ట్వీట్‌ను రీ ట్వీట్‌ చేస్తూ నువ్వు చేసిన మోసం అంత త్వరగా ఎలా మర్చిపోతాం అంటూ రిప్లై ఇస్తున్నారు అభిమానులు. మరి ఈ రియాక్షన్‌పై అలీ స్పందిస్తాడేమో చూడాలి.