వాస్తవాలు బోధపడ్డాక సీఎం జగన్ నిర్ణయం చిత్ర పరిశ్రమకు ఎంత మేలు చేస్తుందో తెలిసొచ్చింది. ఆయన పరిశ్రమను తొక్కాలని కాదు, పైకి తేవాలని చూశారని అర్థమైంది. తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇదే అభిప్రాయం వెల్లడించారు.
ఏపీలో టికెట్స్ ధరలు తగ్గిస్తూ విడుదల చేసిన జీవో ఎంత పెద్ద వివాదానికి దారితీసిందో తెలిసిందే. రాజకీయ రంగు పులుకున్న ఈ గొడవ అనేక మలుపులు తీసుకుంది. చివరికి పరిశ్రమ పెద్దల విజ్ఞప్తి మేరకు ఏపీ గవర్నమెంట్ టికెట్స్ ధరలు పెంచడం జరిగింది. చిరంజీవి అధ్యక్షతన మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్ నారాయణమూర్తి, మహి వి రాఘవ సీఎం జగన్ ని కలిశారు. అటు ప్రేక్షకులు, ఇటు నిర్మాతలు ఇబ్బందులు పడకుండా కమిటీ సిఫారసు మేరకు ఏపీలో టికెట్స్ ధరలు పెరిగాయి. తెలంగాణాలో అంతకు ముందే భారీగా టికెట్స్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
అక్కడ టికెట్ ధర అత్యధికంగా మల్టీప్లెక్స్ లలో రూ. 350 వరకు ఉంది. పెద్ద చిత్రాల విడుదల సమయంలో మరో వంద రూపాయలు పెంచి అమ్ముకునేలా వెసులుబాటు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో అధికారికంగానే సినిమా టికెట్ ధర బ్లాక్ టికెట్ ధరను దాటేసింది. ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమా థియేటర్ లో చూడాలంటే టికెట్ కి రూ. 500 వెచ్చించాల్సిన పరిస్థితి. ఈ పరిణామం తీవ్ర ప్రతికూలతలకు దారి తీసింది. టికెట్స్ ధరలకు భయపడి ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం మానేశారు. ఓ నెల రోజుల తర్వాత ఓటీటీలో చూడొచ్చులే అనే భావనకు వచ్చేస్తున్నారు.
గ్రౌండ్ లెవెల్ లో అత్యధిక టికెట్స్ ధరలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీస్తున్నాయి. దెబ్బకు నిర్మాతల ఆలోచన మారిపోయింది. ఎఫ్ 3 చిత్రానికి నిర్ణయించిన ధరలకే టికెట్స్ అమ్ముతామని దిల్ రాజు ప్రకటించారు. ఇక విరాటపర్వం చిత్రానికైతే ప్రభుత్వం నిర్ణయించిన ధరలను కూడా తగ్గించి విక్రయిస్తున్నారు. ఈ మధ్య విడుదలైన కొన్ని చిత్రాలు అధిక ధరల కారణంగా ఘోరంగా దెబ్బతిన్నాయి. అతి తక్కువ ధరలతో నాని శ్యామ్ సింగరాయ్ లాభాలు పంచగా, ధరలు పెంచాక విడుదలైన అంటే సుందరానికీ డిజాస్టర్ గా నిలిచింది.
వాస్తవాలు బోధపడ్డాక సీఎం జగన్ నిర్ణయం చిత్ర పరిశ్రమకు ఎంత మేలు చేస్తుందో తెలిసొచ్చింది. ఆయన పరిశ్రమను తొక్కాలని కాదు, పైకి తేవాలని చూశారని అర్థమైంది. తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇదే అభిప్రాయం వెల్లడించారు. టికెట్స్ ధరల పెంపు కోసం పోరాడిన మేమంతా జోకర్లమని ఆయన అన్నారు. జగన్ తీసుకున్న నిర్ణయం వంద శాతం కరెక్ట్ అని రుజువైంది. ప్రేక్షకుల స్తోమతకు మించి ధరలు పెంచితే థియేటర్స్ లో సినిమాలు ఎవరూ చూడరని తెలిసొచ్చింది. ఏదో జరిగిపోతుందని అప్పుడు మేము రాద్ధాంతం చేశాం. వాస్తవాలు తెలిశాక మేము చేసిన తప్పు తెలిసిందన్న అభిప్రాయం వర్మ వెలువరించారు.
