లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ సంచలన ట్వీట్ చేశారు. కంగనా రనౌత్ ప్రధాన పాత్ర చేస్తున్న కారణంగా ఓ మూవీ నుండి తప్పుకున్నట్లు ప్రకటించారు. తన అధికారిక ట్విట్టర్ ద్వారా ఈ విషయం తెలియజేశాడు. తన ట్వీట్ లో కంగనా రనౌత్ ప్రధాన పాత్ర చేస్తున్న కారణంగా నేను ఒక మూవీ వదులుకున్నాను. బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను మూవీ నుండి తప్పుకుంటున్నట్లు నిర్మాతలకు తెలియజేశాను. వారు నన్ను అర్థం చేసుకొని అంగీకారం తెలిపారు. ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటున్నామో అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఈ చిత్ర యూనిట్ కి నా బెస్ట్ విషెష్' అని శ్రీరామ్ తన ట్వీట్ లో పొందుపరిచారు. 

కొద్దిరోజులుగా కంగనా మరియు బాలీవుడ్ మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఎప్పటి నుండో బాలీవుడ్ పెద్దలపై ఆరోపణలు చేస్తున్న కంగనా రనౌత్ సుశాంత్ మరణం తరువాత మరింత ఉధృతం చేశారు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న కామెంట్స్, పోస్ట్లు చాలా వివాదాస్పదంగా ఉన్నాయి. బాలీవుడ్ డ్రగ్ కల్చర్ పై కూడా కంగనా దారుణమైన ఆరోపణలు చేయడం జరిగింది. అలాగే కంగనాకు, మహారాష్ట్ర సర్కారుకు మధ్య సీరియస్ వార్ నడుస్తుంది. 

ఈ నేపథ్యంలో కంగనా కారణంగా మూవీని వదులుకున్నానని ఆమె పట్ల పీసీ శ్రీరామ్ నిరసన వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. పీసీ శ్రీరామ్ వదులుకున్న ఆ చిత్రం ఏమిటనేది ఆయన చెప్పలేదు. మరి పీసీ శ్రీరామ్ ట్వీట్ పై కంగనా ఎలా స్పందిస్తుందో చూడాలి. తమిళనాడుకు చెందిన పీసీ శ్రీరామ్ తన అద్భుత కెమెరా వర్క్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. 1987లో వచ్చిన నాయకుడు చిత్రానికి పీసీ శ్రీరామ్ జాతీయ అవార్డు గెలుపొందారు.