చిరంజీవి హీరోగా `ఆచార్య` చిత్రం రూపొందుతుంది. భారీ బడ్జెట్‌తో స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ ఈ సినిమాని రూపొందిస్తున్నారు. కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. మ్యాట్నీ ఎంటైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ ప్రై.లిమిటెడ్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. 

సినిమా కోసం భారీ సెట్‌ వేస్తున్నారట. కోట్లు వెచ్చించి ఇండియాలోనే ఇప్పటి వరకు వేయనటువంటి సెట్‌ వేస్తున్నారని తెలుస్తుంది. ఈ సెట్‌ ఏకంగా 20 ఎకరాల్లో ఉంటుందట. ఇంతటి విశాలమైన సెట్‌ వేయడం ఇదే తొలిసారి అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇందులో టెంపుల్‌ టౌన్‌ని నిర్మిస్తున్నారట. ఇది సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని, దీనికోసం అయ్యే ఖర్చు కోట్లల్లో ఉంటుందని టాక్‌. 

ఈ నెల 10 నుంచి చిరంజీవిపై సోలోగా పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట. అనంతరం రామ్‌చరణ్‌, ఇతర ప్రధాన తారాగణంతో కూడిన సన్నివేశాల్లో చిరు పాల్గొంటారని సమాచారం. మరోవైపు ఇందులో చిరంజీవి, రామ్‌చరణ్‌లపై ఓ పాట ఉంటుందని తెలుస్తుంది. సంక్రాంతి తర్వాత ఈ చిత్ర షూటింగ్‌ రామ్‌చరణ్‌ పాల్గొననున్నారు. ఆయన సన్నివేశాలు చిత్రీకరించేందుకు చరణ్‌ 30 రోజుల కాల్‌షీట్లు ఇచ్చారట. 

ఇందులోనే ఆయన పాత్ర సన్నివేశాలరు, అలాగే చిరుతో కలిసి సాంగ్‌ని షూట్‌ చేయబోతున్నారట. ఇప్పటికే `మగధీర`, `ఖైదీ నెంబర్‌ 150`లో చిరంజీవి, చరణ్‌ స్టెప్పులేశారు. `బ్రూస్‌లీ` చిత్రంలోనూ ఇద్దరు కలిసి మెరిశారు. ఇప్పుడు మరోసారి తండ్రీ తనయులు ఒకే తెరపై సందడి చేయబోతున్నారు. ఇది ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు. ఈ సినిమాని మేలో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు.