Asianet News TeluguAsianet News Telugu

రివ్యూ: చినబాబు

ఆకట్టుకునే కథ, కథనాలు, కామెడీ, ఎమోషన్స్, సెంటిమెంట్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నప్పటికీ తెలుగు ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పిస్తుందనే విషయం మాత్రం చెప్పలేని పరిస్థితి. తమిళ సినిమాలు, కుటుంబ నేపధ్యం ఉన్న కథలు ఇష్టపడే ఆడియన్స్ కు మాత్రం ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. 

chinababu movie telugu review

నటీనటులు: కార్తి, సాయేషా సైగల్, సత్యరాజ్, సూరి తదితరులు 
సంగీతం: డి.ఇమ్మాన్ 
సినిమాటోగ్రఫీ: వేల్ రాజ్ 
ఎడిటింగ్: రూబెన్  
నిర్మాత: సూర్య
దర్శకత్వం: పాండిరాజ్

తమిళ హీరో కార్తి తన సినిమాలతో తెలుగు వారికి కూడా దగ్గరయ్యాడు. ఇక్కడి ప్రేక్షకులు కూడా కార్తి సినిమాలపై ఆసక్తి చూపుతుంటారు. 'ఊపిరి' సినిమాలో డబ్బింగ్ చెప్పి తెలుగు భాషపై తన మక్కువ చాటుకున్నాడు. అతడు నటించే ప్రతి సినిమాను తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేస్తుంటాడు. ఈ క్రమంలో అతడు నటించిన 'కడైకుట్టి సింగం' సినిమాను 'చినబాబు' పేరుతో తెలుగులో విడుదల చేశారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ: 
రుద్రరాజు(సత్యరాజ్) కు నలుగురు ఆడపిల్లలు. మగ బిడ్డ కోసం తన భార్య చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు కూడా ఆడబిడ్డే పుడుతుంది. కొన్నేళ్లకు రుద్రరాజు మొదటి భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. అతడే కృష్ణంరాజు(కార్తి). ఐదుగురు ఆడపిల్లల తరువాత పుట్టిన మగబిడ్డ కావడంతో అందరూ ప్రేమగా చూసుకుంటారు. ఐదుగురు అక్కలు, బావలు.. ఇద్దరు మరదళ్లు ఇలా కృష్ణంరాజుది చాలా పెద్దకుటుంబం. వ్యవసాయం చేస్తూ తన అక్కలకు, వాళ్ల కూతుళ్లకు కావల్సినవి సమకూరుస్తూ ఉంటాడు కృష్ణంరాజు. అతడి ఇద్దరి మరదళ్లు కృష్ణంరాజుని పెళ్లి చేసుకోవాలని ఆశ పడతారు. కానీ అతడు మాత్రం నీలనీరద(సాయేషా) అనే అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. ఆమె కూడా కృష్ణంరాజుని  ఇష్టపడుతుంది. నీలనీరద మావయ్య సురేందర్ రాజు(శత్రు)కి కృష్ణంరాజుకి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఓ మర్డర్ కేసు విషయంలో కృష్ణంరాజు.. సురేందర్ రాజుని పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తాడు. దీంతో సురేందర్ రాజు.. కృష్ణంరాజుని చంపాలని నిర్ణయించుకుంటాడు. ఆ తరువాత ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి..? కృష్ణంరాజు తన మరదళ్లని కాదని బయట అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడు..? ఈ కారణంగా కుటుంబంలో ఎలాంటి చీలికలు వస్తాయి..? తన కుటుంబం కోసం కృష్ణంరాజు తన ప్రేమను వదులుకున్నాడా..? సురేందర్ రాజు.. కృష్ణంరాజుపై ఎలా పగ తీర్చుకున్నాడు..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

విశ్లేషణ: 
ఊరిలోనే పెద్ద కుటుంబం ఐదుగురు అక్కలు, బావలతో సంతోషంగా ఉండే హీరో.. తన ప్రేమ కోసం కుటుంబంలో వచ్చిన తగాదాలను ఎలా పరిష్కరించాడనేదే ఈ సినిమా. దర్శకుడు పాండిరాజ్ సినిమాలన్నీ కూడా వైవిధ్యంతో కూడి ఉంటాయి. తన సినిమాల ద్వారా ఆడియన్స్ కు ఓ మంచి సందేశం చెప్పాలనుకుంటాడు. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన 'పసంగ' తెలుగులో 'మేము' అనే పేరుతో విడుదలైంది. సూర్య నటించిన ఈ సినిమా ద్వారా చిన్నపిల్లల మనస్తత్వాలను తల్లితండ్రులు ఎలా అర్ధం చేసుకోవాలని చూపించాడు. ఈ సినిమాలో అయితే సంస్కృతి, పిల్లలే సంపద అనే విషయాలను చూపించాడు. కుటుంబ బంధాలే మనుషులకు ముఖ్యమని పాండిరాజ్ చెప్పాలనుకున్న విషయం ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పిస్తుంది. అయితే ఇక్కడ కార్తి, సత్యరాజ్ వంటి నటులు తప్ప మిగిలిన నటీనటులు అందరూ తమిళవారే కావడంతో తెలుగు ఆడియన్స్ వాళ్ల ఎమోషన్స్ కు కనెక్ట్  కాలేకపోతారు. అయినప్పటికీ కథలో ఉన్న సెంటిమెంట్, బాండింగ్ వంటి విషయాలు ఆకట్టుకుంటాయి. సినిమా మొత్తం కూడా ఫ్యామిలీ, హీరో ప్రేమ విషయం, ఓ చిన్న కాన్ఫ్లిక్ట్ వంటి విషయాలతోనే నడుస్తుంది. పాత కథను కూడా మెప్పించే విధంగా ప్రెజంట్ చేయొచ్చని దర్శకుడు పాండిరాజ్ మరోసారి నిరూపించాడు.

chinababu movie telugu review
ఈ మధ్యకాలంలో వచ్చిన తెలుగు సినిమాల కంటే ఈ తమిళ డబ్బింగ్ ఫిలిం చాలా బెటర్ అనిపిస్తుంది. సినిమాలో హీరో వ్యవసాయం చేస్తుంటాడు. అలా అని రైతుల కష్టాలు అంటూ నెగెటివ్ పాయింట్ టచ్ చేయకుండా పాజిటివ్ సైడ్ లోనే చూపించారు. పాటలు, రెండు మూడు సన్నివేశాల్లో తప్ప హీరో రైతుగా ఎక్కువ సమయం కనిపించడు. కానీ రైతుల గురించి చెప్పే స్పీచ్ ఆకట్టుకుంటుంది. అప్పటివరకు కామెడీ, లవ్ ట్రాక్, ఫ్యామిలీ సీన్స్ తో నడిపించిన కథ సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి ఎమోషనల్ గా మారిపోతుంది. తమ మేనమామ బయట అమ్మాయిని చేసుకుంటున్నాడని తెలుసుకున్న ఇద్దరు మరదళ్లు బాధ పడడం.. ఆ కారణంగా కుటుంబం మొత్తం హీరో నుండి సెపరేట్ అయ్యే సన్నివేశాలు ఎమోషనల్ గా కట్టిపడేస్తాయి. చిన్నప్పటి నుండి తన చేతులతో పెంచి, పెద్ద చేసిన అమ్మాయిలను పెళ్లి ఎలా చేసుకోవాలని తన అక్కలను హీరో ప్రశ్నించే సీన్స్, అయినా మీరేం చెప్తే నేను అదే చేస్తా అంటూ డెసిషన్ వాళ్లకే వదిలేయడం వంటి విషయాలు ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతాయి. తన కుటుంబాన్ని, ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో పడే పాట్లు మాములుగా ఉండవు.

అటువంటి పాత్రలో అవలీలగా నటించేశాడు కార్తి. ఎమోషన్స్, లవ్, సెంటిమెంట్ ఇలా ప్రతి సీన్ లో అతడి నటన బాగుంది. ఏ ఒక్క ఫ్రేమ్ లో కూడా కార్తి నటనకు వంక పెట్టలేం. సినిమా మొత్తం పల్లెటూరి రైతు లుక్ లోనే కనిపిస్తాడు. హీరోయిన్ గా సాయేషా బాగానే నటించింది. ఆమె మేకప్, కాస్ట్యూమ్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. సత్యరాజ్ హీరో తండ్రిగా చక్కటి పెర్ఫార్మన్స్ కనబరిచారు. కమెడియన్ సూరి చేసిన కామెడీ థియేటర్ లో నవ్వులు పూయిస్తుంది. అతడి నోటి నుండి వచ్చే ప్రతి మాట ఆడియన్స్ ను నవ్విస్తుంది. హీరో మేనల్లుడి పాత్రలో సూరి నటన ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్. బావ క్యారెక్టర్లు పోషించిన వారితో కూడా మంచి కామెడీ పండించాడు దర్శకుడు. ఒక్కో క్యారెక్టర్ ను ఒక్కో విధంగా ఎస్టాబ్లిష్ చేస్తూ డైరెక్టర్ తెరపై చూపించిన విధానం ఆకట్టుకుంది. విలన్ పాత్రలో తెలుగు నటుడు శత్రు జీవించేశాడు. సెకండ్ హాఫ్ లో కాస్త ల్యాగ్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా సినిమా మాత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్.

chinababu movie telugu review

టెక్నికల్ గా మంచి క్వాలిటీతో రూపొందించారు. ఇమ్మాన్ సంగీతం బాగానే ఉంది కానీ తెలుగు సాహిత్యం సరిగ్గా కుదరలేదు. కొన్ని పాటలలో లిరిక్స్ అర్ధంలేని విధంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. పచ్చటి పొలాలు, పల్లెటూరి వాతావరణం చూడడానికి కనువిందుగా ఉంటుంది. కానీ తమిళ నేటివిటీ ఎక్కువగా ఉండడం, తెలుగు ఆడియన్స్ కు తెలిసిన ఆర్టిస్టులు లేకపోవడం సినిమాకు మైనస్. ఆకట్టుకునే కథ, కథనాలు, కామెడీ, ఎమోషన్స్, సెంటిమెంట్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నప్పటికీ తెలుగు ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పిస్తుందనే విషయం మాత్రం చెప్పలేని పరిస్థితి. తమిళ సినిమాలు, కుటుంబ నేపధ్యం ఉన్న కథలు ఇష్టపడే ఆడియన్స్ కు మాత్రం ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. 

రేటింగ్: 2.5/5 

 

                                         

Follow Us:
Download App:
  • android
  • ios