లాక్ డౌన్ పుణ్యమా అని  తెలుగు సినీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మొత్తం మూతపడి పోయింది. నిన్న కేసీఆర్ ప్రకటనతో కాస్తం ఉత్సాహం తెచ్చుకుని ఊపిరిపోసుకునేందుకు దారులు వెతుకుతోంది. గత మూడు నెలలుగా చిత్ర పరిశ్రమ ఇంటికే పరిమితం కావడం వలన తీవ్ర నష్టాలలో పడింది. దానికి తోడు ఇప్పటికి కూడా మళ్ళీ థియేటర్లు ఎప్పటికి తెరుచుకుంటాయి అనే విషయంలో స్పష్టత లేదు.ఈ నేపధ్యంలో డిజిటల్ ప్లాట్ ఫాం హవా మొదలైంది. ఇప్పటికే అమెజాన్, నెట్ ఫ్లిక్స్, జీ5, ఆహా లాంటి చానల్స్ వాటి ఇంపాక్ట్ మార్కెట్ పై చూపించడం మొదలైంది.ఇప్పటికే తెలుగులో వెబ్ సిరీస్ లు నిర్మితం అవుతున్నాయి. ఈ ప్లాట్ ఫాంలలో సినిమాలు కూడా కొన్ని నేరుగా రిలీజ్ చేస్తున్నారు.ఇప్పటికే వాయిదా పడి రిలీజ్ కోసం వేచి చూస్తున్న చాలా సినిమాలు డిజిటల్ లోకి వచ్చేస్తున్నాయి.ఈ క్రమంలో డిజిటల్ ప్లాట్ ఫాం ల మధ్య పోటీ కూడా అదే రకంగా ఉంది. దాంతో తమ యాప్ లను మార్కెట్ లోకి తీసుకెళ్లటానికి కంటెంట్ ని అందరూ ఆశ్రయిస్తూంటే...అల్లు అరవింద్ మరో అడుగు ముందుకేసి టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండను సీన్ లోకి తెచ్చారు. 

'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమై 'అర్జున్‌రెడ్డి', 'గీతగోవిందం' సినిమాలతో అమ్మాయిల్లో ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్నారు టాలీవుడ్‌ యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ. ఆ క్రేజ్ ని తమ ఆహా యాప్ కు విజయ్ ని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకుని వాడుకుంటున్నారు అల్లు అరవింద్. తెలుగు తొలి ఓటీటీ ఛానెల్ ఆహా. ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ త‌న మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో ఆహాను ముందుకు తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ ఓటీటీలో ఫ్లాట్‌ఫామ్‌లో క్రిష్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ వంటివారు తమ వంతు పాత్ర‌ను పోషిస్తున్నారు. అయితే ఇంకా బెట‌ర్ కంటెంట్ కోసం అర‌వింద్ గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ు. ఈ క్రమంలో పిల్లలను కూడా ఈ శెలవుల్లో టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందనే ఐడియా వారిని కార్టూన్ సినిమాలు, సీరిస్ ల వైపు దృష్టి మరల్చేలా చేసింది.

 28 కార్టూన్ సినిమాలను ఇప్పుడు 'ఆహా' యాప్ నుంచి తమ వీక్షకులకు అందించబోతున్నట్లు వారు వెల్లడించారు. ఇప్పటికే 'ఆహా' బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండతో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. రీసెంట్ గా “కనులు కనులను దోచాయంటే” డిజిటల్ ప్రీమియర్ తో ఆకట్టుకున్న 'ఆహా'లో ఇప్పుడు కార్టూన్ సినిమాలు కూడా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రావటంతో మార్కెట్ లో షేర్ బాగా పెరుగుతుంది. ఛోటా భీమ్ మైటీ రాజు లాంటి కార్టూన్ సినిమాలు వీటిలో ఉన్నాయి. ఈ మేరకు విజయ్ దేవరకొండతో ఓ పోస్టర్ డిజైన్ చేసి వదిలారు. ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి వీటితోనైనా క్రేజ్ తెచ్చుకుని మరోసారి ఆహా అనిపించుకుంటుందేమో చూడాలి.