మాజీ పోర్న్ స్టార్‌, నటి సన్నీలియోన్‌పై ఛీటింగ్‌ కేసు నమోదైంది. కేరళాలోని కొచ్చిలో క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఛీటింగ్‌ కేసు నమోదు చేశారు. ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే, 2019లో ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ సంస్థ కొచ్చిలో నిర్వహించే వాలంటైన్స్ డే ఫంక్షన్‌ పాల్గొనేందుకుగానూ సన్నీలియోన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని విలువు రూ. 29లక్షలు. అయితే ఆ ఈవెంట్‌కి సన్నీలియోన్‌ రాలేదని, ఆ డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని ఆమెపై సదరు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ కొచ్చి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఐపీసీ సెక్షన్‌ 420 కింద సన్నీలియోన్‌పై ఛీటింగ్‌ కేసు నమోదు చేశారు. దీనిపై శనివారం క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు సన్నీలియోన్‌ వద్ద వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. సన్నీలియోన్‌ ఈ ఈవెంట్‌కి రెండు సార్లు వచ్చానని, కానీ వారే ఈవెంట్‌ని నిర్వహించలేదని, ఈ కార్యక్రమం అప్పటికే పలు మార్లు వాయిదా పడిందని, చివరికి కొచ్చిలోని అంగమల్లీలో గల అడ్లక్స్ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఖరారైందని, కానీ వాళ్లు నిర్వహించలేదని చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు ఇంకా తనకే రూ. 12 లక్షలు చెల్లించాల్సి ఉందని సన్నీలియోన్‌ చెప్పిందన్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నట్టు పోలీస్‌ అధికారులు వెల్లడించారు.