మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమా బుధవారం నాడు విడుదలై మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. అన్ని భాషల నుండి ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అభిమానులు, సెలబ్రిటీలు ప్రతీ ఒక్కరూ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వసూళ్ల పరంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. అయితే ఈ సినిమా కారణంగా ఓ ప్రొఫెసర్ కి అన్యాయం జరిగిందనే మాటలు వినిపిస్తున్నాయి. 

'తెలుగు వీరగాథలు' అనే అంశంపై పరిశోధనలు చేసి పీహెచ్‌డీ పట్టా పొందిన ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావుకి 'సైరా' చిత్రయూనిట్ అన్యాయం చేసిందని అంటున్నారు.  తంగిరాల మిత్రుడు, పద్యకళా పరిషత్తు అధ్యక్షుడైన ఎం. రామచంద్రప్రసాద్‌ పేరిట రాసిన ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి మొట్టమొదట పరిశోధన చేసిన వ్యక్తి తంగిరాల వెంకట సుబ్బారావు అని ఆయన 'తెలుగు వీరగాథలు' అనే అంశంపై పరిశోధనలు చేసి పీహెచ్‌డీ పట్టా పొందారని చెప్పారు. తంగిరాల 1965 డిసంబర్ నుండి 1966 ఏప్రిల్ నెల వరకు రేనాటి సీమ(కడప, కర్నూల్)లో పర్యటించి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సంబంధించిన అనేక విషయాలు, జానపదగేయాలు, వీరగాథలు సేకరించారని చెప్పారు.

1969 జూన్ నెల భారతిలో 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' అనే వ్యాసాన్ని తంగిరాల ప్రచురించారని గుర్తు చేసుకున్నారు. దీంతో ఉయ్యాలవాడ గురించి అందరికీ తెలిసిందని.. ఆచార్య తంగిరాల మరిన్ని పరిశోధనలు జరిపి, 1999లో 'రేనాటి సూర్యచంద్రులు' అనే బృహద్గ్రంథాన్ని ప్రచురించారని చెప్పారు. ఇందులో నరసింహారెడ్డికి సంబంధించిన ఎన్నో విషయాలు ఉన్నాయని చెప్పారు.

2017లో “సైరా” దర్శకుడి అసిస్టెంట్ రామ్మోహనరావు, పరుచూరి బ్రదర్స్‌ అసిస్టెంట్ బాలాజీ (దాము) ఆచార్య తంగిరాలనుసంప్రదించి 'రేనాటి సూర్యచంద్రులు' పుస్తకాన్ని, ఒక్కొక్కరు ఒక్కో కాపీ తీసుకొని వెళ్లారని రామచంద్రప్రసాద్‌ తెలిపారు. సినిమా తీస్తున్నారా? అని తంగిరాల ప్రశ్నిస్తే.. లేదు, సీరియల్ తీస్తున్నామని ఒకరు, పరిశోధన చేస్తున్నామని మరొకరు అబద్ధం చెప్పారని.. తరువాత పేపర్ లో చూస్తే చిరంజీవి గారు సినిమా తీస్తున్నారని భారీ బడ్జెట్ అని తెలిసిందని చెప్పారు.

తంగిరాల వారి పేరు ఎక్కడా చెప్పలేదని.. మూడు వందల కోట్ల రూపాయలతో సినిమా తీసి, దాని గురించి పరిశోధన చేసిన తంగిరాలకు మూడు రూపాయల విలువ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. 'సైరా' అనే టైటిల్ కూడా తంగిరాల సేకరించిన పిచ్చుకుంట్ల పాటలో నుండి తీసుకున్నారని.. సినిమావాళ్ల మహామాయల్లో దీనిని మించిన మాయ మరొకటి లేదని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రామచంద్ర ప్రసాద్ అన్నారు. ఈ ఆరోపణల విషయంలో చిత్రబృందం ఎలా స్పందిస్తుందో చూడాలి!