ఆగస్ట్ 15 తేదీన... హైదరాబాద్  సిటీ పోలీస్ లు అంతా ..స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బిజిగా ఉంటే..ఊహించని విధంగా.. యాభై ఇళ్లలో దొంగతనాలు జరుగుతాయి. ముసలి వాళ్లు ఉంటే ఇళ్లను టార్గెట్ చేసారని, అన్ని ఇళ్లల్లోనూ ముసుగు వేసుకుని వచ్చిన ఇద్దరే  దొంగతనం చేసారని తర్వాత ఇన్విస్టిగేషన్ లో తేలుతుంది. ఎక్కడా ఏ ఆధారం లేదు. కేసు ముందుకు వెళ్ళే క్లూలు అసలు లేవు. ఈ కేసుని డిపార్టమెంట్ లో సమర్దురాలుగా పేరు తెచ్చుకున్న  ఏసీపీ గాయత్రి(శద్ధా శ్రీనాథ్) టేకప్ చేస్తుంది. ఇక ఈ దొంగతనాల్లో ఒక ఇంట్లో ప్రభుత్వం ఇచ్చిన  అశోక చక్ర మెడల్ ని కూడా దొంగతనం జరిగిందని అర్దమవుతుంది. ఆ మెడల్ ...చంద్ర (విశాల్)తండ్రిది. చంద్ర కూడా ఓ సైనికుడు. దాంతో మిలిట్రీ నుంచి వచ్చిన చంద్ర..తన మాజీ ప్రేయసి ఏసీపీ గాయత్రితో కలిసి ఆ దొంగలెవరో తేల్చటానికి  రంగంలోకి దూకుతాడు. ఈ క్రమంలో ఆ దొంగల వెనక ఉన్న మాస్టర్ మైండ్ లీల(రెజీనా కసెండ్రా) గురించి తెలుస్తుంది. ఆమె కూడా సామాన్యురాలు కాదు. చాలా పట్టుదల గల వ్యక్తిత్వం. చాలా తెలివైంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా ఎత్తులకు,పై ఎత్తులు మొదలవుతాయి. ఖచ్చితమైన ఆధారాలు, సాక్ష్యాలతో ఆమెను పట్టుకోవాలనే  చంద్ర ఆలోచన ఎలా నెరవేరింది. ఆ క్రమంలో ఏం చేసాడు. లీల ఎలా రివర్స్ కౌంటర్స్ ఇచ్చింది. తిరిగి తన తండ్రి సాధించిన అశోక చక్ర మెడల్‌ తిరిగి ఎలా సంపాదించాడు? వంటి విషయాలు తెలియాలంటే సినమా చూడాల్సిందే. 

ఎలా ఉంది..

మన  నిత్య జీవితంలో ఓ భాగమైపోయిన డిజిటల్ వరల్డ్ ని మనం కాదనలేము. వదిలి వెళ్లలేము. అయితే అదే సమయంలో ఆర్థిక మోసాలు భార‌త‌దేశంలో చాలా సాధార‌ణ‌మైపోయాయనే విషాయన్ని మర్చిపోకుండా ఉండలేము. అనైతికంగా లేదా అక్ర‌మ మార్గంలో పెద్ద ఎత్తున డ‌బ్బు సంపాదించి మోసం చేయ‌డం సైబర్ క్రైమ్ లో సర్వ సాధారణం అయ్యిపోయింది. ప్రధానం గా టెక్నాలిజీ పట్ల పెద్దగా అవగాహన లేకుండా డిజిటల్ ప్రపంచంలో ప్రవేశించేవారిని మోసం చేయడమే సైబర్ క్రిమినల్స్ పనిగా పెట్టుకున్నారు. మన ప్రతీ అడుగు..మన అందించే డేటా ద్వారా డిసైడ్ చేసే స్దితికి కార్పోరేట్ కంపెనీలు ఎదిగాయి. ఈ క్రమంలో అవగాహన కోసం ఇలాంటి సినిమాలు అత్యవసరం. అయితే ఈ సినిమాకు అంత సీన్ లేదనే చెప్పాలి. ప్రారంభంలో కాసేపు ఇదే కాన్సెప్టుపై సినిమా అన్నట్లు హ్యాకింగ్ గురించి చూపారు. కానీ మెల్లిమెల్లిగా ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి హ్యాకింగ్ కు హ్యాండ్ ఇచ్చి...ఫలానా ఆమే విలన్ అని రివీల్ చేసారు. 

అక్కడ నుంచి విలన్, హీరో మధ్య గేమ్ లా ఉంటుంది తప్ప..మధ్యలో సైబర్ క్రైమ్ కు సంభందించిన సినిమా అనే విషయం మర్చిపోయారు. దాంతో కేవలం ఎత్తుగడకు మాత్రమే సైబర్ క్రైమ్ నేపధ్యాన్ని వాడుకున్నారని అర్దమవుతుంది. దాంతో మనకు ఖచ్చితంగా నిరాశ కలుగుతుంది. దానికి తోడు విలన్ కు, హీరోకు మద్య ఇంటరాక్షన్ వచ్చి, ఎదురుదాడి మొదలయ్యేసరికే సెకండాఫ్ సగానికి వచ్చేస్తుంది. అక్కడ నుంచైనా పరుగెడుతుంది అనుకుంటే సోసోగా ఉంటుంది. విశాల్ ఉన్నాడు కదా అని ఓ రెండు ,మూడు యాక్షన్ ఎపిసోడ్స్ కలిపారు. ఇందులో డైరక్టర్ మనకు చేసిన ఏకైక మేలు..సినిమా మొత్తం ఒకే పాట పెట్టడం. అదీ హీరో,హీరోయిన్ మీద కాదు. 

అలాగే ఈ సినిమాకు మొన్న విజయ్ హీరోగా వచ్చిన మాస్టర్ సినిమాకు ఓ పోలిక ఉంది. ఈ రెండు సినిమాల్లో విలన్స్ కు ప్లాష్ బ్యాక్ లు ఉంటాయి. వారిపై సానుభూతి కలిగేలా. అయితే విలన్ మీదా సానుభూతి వచ్చి, హీరో కు వచ్చిన సమస్య మీదా సానుభూతి వస్తే చూసే మనం ఎవరికి జై కొట్టాలి. ఎవరితో సినిమా చూసేటప్పుడు మానసికంగా ట్రావెల్ చేయాలి. ఏదైమైనా ఫస్టాఫ్ ఉన్నంతగా సెకండాఫ్ లేదు. క్లైమాక్స్ అయితే పూర్తిగా తేలిపోయింది. 

అలాగే హీరో మిలిట్రీ వాడు. కానీ పోలీస్ డిపార్టమెంట్ ని మొత్తం అల్లాడిస్తూంటాడు. ఏసీపీ నుంచి సిటీ పోలీస్ కమీషనర్ దాకా అందిరనీ సింగిల్ హ్యాండ్ తో కంట్రోలు చేస్తూంటాడు.అసలు పోలీస్ డిపార్టమెంట్ లో అతనికేం పనో అర్దం కాదు. అయినా ఆర్మీలో హీరోని పెట్టడం వలన ఒరిగిందేమిటో అర్దం కాదు. కేవలం పరమ వీర చక్రకు హీరో గౌరవం ఇచ్చి దాన్ని పట్టుకోవటానికి దొంగలు వెంటపడతాడనా..? అయినా డేటా దొంగతనం అనే ప్రస్తుతం అందరూ ఎదుర్కొంటున్న పాయింట్ ని తీసుకున్న దర్శకుడు దాని మీద డెప్త్ గా వెళ్లకుండా పైపైన లాగేయటం మాత్రం దారుణం.
 

టెక్నికల్ గా...
ఈ సినిమాలో రీరికార్డింగ్, కెమెరా వర్క్ గురించే గొప్పగా చెప్పుకోవాలి. మిగతాదంతా సోసో. హీరో విశాల్ చాలా రిలాక్సింగ్ గా ఈ సినిమా చేసినట్లున్నాడు. కండలు పెంచి, ప్రదర్శించటంలో తప్ప ఎక్కడా ఎక్సప్రెషన్స్ లేవు.  ఏసీపీ గాయ‌త్రిగా శ్ర‌ద్ధా శ్రీనాధ్ బాగా చేసింది. విలన్ గా రెజీనా కంప్యూటర్ జీనియస్ గా, చెస్ ప్లేయర్ గా కనపడుతుంది. ఫస్టాఫ్ లో ఎంతో బిల్డప్ గా క్రైమ్ లు చేసే ఆమె తర్వాత ఎందుకో రెగ్యులర్ విలన్ గా మారిపోతుంది. ఆమె పాత్రను  ‘The Girl with the Dragon Tattoo’ నుంచి లేపినట్లున్నారు.  

 ఫైనల్ థాట్

సైబర్ క్రైమ్ మీద చేసే ప్రతీ సినిమా 'అభిమన్య' అవ్వాలని ఆశించటం అత్యాసే. 

Rating: 2

ఎవరెవరు..
 బ్యానర్‌: విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ; 
 నటీనటులు: విశాల్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, రెజీనా, శ్రుతి డాంగే,రోబో శంకర్‌, మనోబాల తదితరులు;
 సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా;
 సినిమాటోగ్రఫీ: కె.టి.బాలసుబ్రహ్మణ్యం; 
ఎడిటింగ్‌: త్యాగు;
నిర్మాత: విశాల్‌;
 రచన, దర్శకత్వం: ఎం.ఎస్‌.ఆనందన్‌; 
విడుదల తేదీ: 19-02-2021