జబర్దస్త్ హాస్యనటుడు కెవ్వు కార్తీక్‌పై కేసు నమోదైంది. గూడూరు పోలీస్‌ స్టేషన్‌లో కిడ్నాప్‌, దాడి కేసు నమోదైంది. భూపతిపేటలో ఉండే తన సోదరి, భర్తపై స్నేహితులతో  కలిసి దాడి చేశారని, అనంతరం కిడ్నాప్‌కి యత్నించారని ఆరోపణలో కేసు నమోదు చేశారు. కార్తీక్‌తోపాటు ఐదుగురు వ్యక్తులు వచ్చి తనపై దాడి చేసినట్టు బాధితుడు, కార్తీక్‌  బావ ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

సుమారు పదిహేను కిలో మీటర్ల దూరం కారులో తీసుకెళ్లి కొట్టించాడని, కార్తీక్‌తోపాటు అతని తల్లిదండ్రులు, వెంట వచ్చిన వారిపై పలు సెక్షన్ల కింద నమోదు చేసినట్టు గూడూరు పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై సురేష్‌ నాయక్‌ తెలిపారు. 

ఈటీవీలో ప్రసారమయ్యే `జబర్దస్త్` షో ద్వారా ఆకట్టుకుంటున్న కార్తీక్‌ ఇటీవల సుమ హోస్ట్ గా ప్రసారమయ్యే `క్యాష్` షోలో తన తల్లి వ్యధ చెప్పి ఎమోషనల్ అయ్యాడు. తన తల్లి ఆరోగ్యం బాగోలేక, మూడు సర్జరీలు చేయించుకొని అతి కష్టం మీద బ్రతుకుతుందని, ఆమె కోసమే తాను ప్రతి పైసా కష్టపడి సంపాదిస్తున్న అంటూ చెప్పి అందరిని భావోద్వేగానికి గురి చేశాడు. తాజాగా సొంత బావ విషయంలో కిడ్నాప్‌ కేసు నమోదు కావడం గమనార్హం.