రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఆ కారణంగానే రామ్ చరణ్ అభిమానులకు ఓ లేఖ రాశాడు. ఇకపై మిమ్మల్ని మెప్పించే సినిమాలే చేస్తానని లెటర్ లో రాసుకొచ్చాడు.

ఈ సినిమాతో బయ్యర్లు మొత్తంగా ముప్పై కోట్ల వరకు నష్టపోయినట్లు లెక్క తేల్చారు. దీంతో రామ్ చరణ్ తన రెమ్యునరేషన్ లో ఐదు కోట్లు తిరిగి ఇస్తానని, మీరు కూడా అలా చేస్తే బయ్యర్లకు కొంతవరకు డబ్బుని తిరిగి ఇవ్వొచ్చని దర్శకనిర్మాతల వద్ద ఓ ప్రతిపాదన తీసుకొచ్చాడట. దానికి నిర్మాత దానయ్య అంగీకరించినా.. బోయపాటి మాత్రం స్పందించలేదట.

దీంతో దిల్ రాజుని పెద్దమనిషిగా పెట్టి రీసెంట్ గా ఓ మీటింగ్ పెట్టారట. ఈ మీటింగ్ లో బోయపాటి ఐదు కోట్లు తిరిగివ్వలేనని, ఒకటో రెండు కోట్లో సర్దుతానని అన్నాడట. దీంతో నిర్మాత దానయ్య సీరియస్ అయినట్లు తెలుస్తోంది. రూ.15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకొని, వంద కోట్లు సినిమాపై ఖర్చు పెట్టించి.. బ్యాడ్ అవుట్ పుట్ ఇచ్చి ఇప్పుడు డబ్బు తిరిగివ్వనంటే ఎలా అంటూ బోయపాటిని ప్రశ్నించాడట.

బోయపాటి కూడా సీరియస్ అవ్వడంతో ఒకరినొకరు బూతులు తిట్టుకునే వరకూ వ్యవహారం వెళ్లిందని తెలుస్తోంది. దీంతో మధ్యవర్తులుగా వ్యవహరించిన కొందరు వ్యక్తులు వాళ్లని శాంతపరిచినట్లు తెలుస్తోంది. మరి ఈ వివాదం ఎప్పుడు పరిష్కారమవుతుందో చూడాలి!