కరోనా ప్రభావం బాలీవుడ్ సినీ ప్రముఖులను కలవరపెడుతుంది. వరుసగా బాలీవుడ్‌ స్టార్స్ ఇళ్లలో కరోనా కేసులు భయపడటంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. అయితే తాజాగా ఒక్కొక్కరు ఈ మహమ్మారి నుంచి బయట పడుతున్నారు. ముందుగా కరోనా బారిన పడిన నిర్మాత కరీం మోరానీ ఆయన ఇద్దరి కూతుళ్లు కోలుకోగా తరువాత కరోనా బారిన పడిన బోని కపూర్‌ ఇంటి స్టాఫ్ కూడా కోలుకున్నారు.

ఇటీవల బోని కపూర్‌ ఇంట్లో పనిచేస్తున్న ముగ్గురు పనివారికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో బోని ఫ్యామిలీ అంతా హోం క్వారెంటైన్‌లోకి వెళ్లిపోయారు. తాజాగా వారి క్వారెంటైన్‌ పీరియెడ్ పూర్తి చేసుకున్నట్టుగా ప్రకటించాడు బోని కపూర్‌. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు బోని కపూర్‌.

`నాకు, నా కూతుళ్లకు టెస్ట్ చేసిన ప్రతీ సారి నెగెటివే వచ్చింది. కానీ మా ఇంట్లో పనిచేసే ముగ్గురికి పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాళ్లంతా కోలుకున్నారని తెలియజేయటం ఆనందంగా ఉంది. మేం కూడా 14 రోజలు క్వారెంటైన్‌ కాలాన్ని పూర్తి  చేసుకున్నాం. కొత్త ప్రయాణం మొదలు పెట్టడానికి ఎదురుచూస్తున్నాం` అంటూ ట్వీట్ చేశాడు బోని కపూర్. ఇక బోని కపూర్‌ తరువాత మరో స్టార్ ప్రొడ్యూసర్‌ కరణ్ జోహర్ ఇంట్లో కూడా కరోనా కేసులు వచ్చిన సంగతి తెలిసిందే.