దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిన బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఈ కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్లు  వినిపిస్తున్న సమయంలో సుశాంత్ తండ్రి.. రియా చక్రవర్తిపై కేసు నమోదు చేయడంతో అనూహ్య మలుపు తీసుకుంది.

ఈ కేసులో తాజాగా మనీలాండరింగ్ కోణం వెలుగు చూసింది. రియా, ఆమె కుటుంబసభ్యులు సుశాంత్‌కు సంబంధించిన రూ.15 కోట్లు మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు సుశాంత్ తండ్రి ఆరోపించడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది.

Also Read:సుశాంత్ ఆత్మహత్యకు ముందు ఇంట్లో పార్టీ.. పనివాళ్లు ఏమన్నారంటే.

సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు.. నలుగురు సభ్యులతో కూడిన పోలీసు బృందం జూలై 29న ముంబై చేరుకుని విచారణ చేపట్టింది. మరోవైపు ఈ కేసును పట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలని రియా చక్రవర్తి సుప్రీంకోర్టును కోరింది. అయితే బిహార్ ప్రభుత్వంతో పాటు సుశాంత్ తండ్రి ఈ అభ్యర్ధనను తోసి పుచ్చారు.

మరోవైపు బీహార్ పోలీసులు సుశాంత్ బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేయడంతో పాటు రియా ఇంటిని కూడా సోదా చేశారు. ఈ తనిఖీల్లో సుశాంత్ ఖాతా నుంచి రియా ఖాతాకు పెద్దగా నగదు బదిలీ ఏమీ జరగలేదని గుర్తించారు.సుశాంత్ కుటుంబసభ్యులు చెబుతున్నంత నిల్వ కూడా ఖాతాలో లేదని తేలింది.

సుప్రీంకోర్టుకు రియా సమర్పించిన పిటిషన్‌లో తాను సుశాంత్‌తో ఏడాదిగా లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. అదే సమయంలో ఆయన తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు చెప్పింది. ఇకపోతే సుశాంత్ మాజీ ప్రియురాలు అంకిత లోఖండే స్టేట్‌మెంటును కూడా పోలీసులు రికార్డు చేశారు.

Also Read:షాకింగ్: ఏకంగా రియా కుటుంబాన్నే సాకిన సుశాంత్

ఇక బీఎండబ్ల్యూ, జాగ్వార్ కార్లకు సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం రాత్రి అంకిత ఇంటికి ఆటోలో వచ్చిన పోలీసులు ఆమెను విచారించిన అనంతరం జాగ్వార్ కారులో వెళ్లారు. శుక్రవారం ఉదయం బీఎండబ్ల్యూ కారును స్వాధీనం చేసుకున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. సుశాంత్ కేసులో అనేక కోణాలున్న నేపథ్యంతో పాటు కొత్తగా మనీలాండరింగ్ అభియోగాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు అప్పగించాలని ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. ఆ కాసేపటికే ఈడీ కేసు నమోదు చేయడం కొసమెరుపు.