కథ

ఈశ్వర్ ప్రసాద్ (అర్షద్ వార్సీ) ఓ నిజాయితీ గల మంత్రి..మాస్ లీడర్. అయితే ఇలా ఇంత పేరు తెచ్చుకోవటం ఆయనతో తిరిగే వాళ్లలో చాలా మందికి నచ్చదు. ఎలాగైనా ఆయన్ను క్రిందకి దింపాలని,రోడ్డుపై పెట్టాలని ప్లాన్ చేస్తూంటారు. ఇందుకోసం వాళ్లు సీబీఐ ఆఫీసర్ శతాక్షి గంగూలి(మహిగిల్)ని ఆశ్రయిస్తారు. ఆమె ఈశ్వర్ ప్రసాద్ ని బీహార్ లోని పురాతన విగ్రహాల మాయం కేసులో ఇరికించాలనుకుంటుంది.అందుకోస్ం ఆయనతో పదేళ్లపాటు పనిచేసిన మాజీ సలహాదారు..చంచల చౌహాన్ ఐఏఎస్ (భూమి పెర్నాండెజ్) ని ఇంటరాగేట్ చేయాలనుకుంటుంది. చంచల ఆల్రెడీ జైల్లో ఉంది. అయితే చంచల్ ని సీక్రెట్ గా మాత్రమే ఇంటరాగేట్ చేయాలని ఊరికి దూరంగా,వెలివేసినట్లుంటే దుర్గా మహల్ కు తీసుకువస్తారు. అయితే అక్కడే ఓ ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటాయి. భయపెట్టే సంఘనటలు జరుగుతూంటాయి.   అక్కడే ఉన్న దుర్గామతి ఆత్మ...చంచలని ఆవహిస్తుంది. అక్కడ నుంచి కథ ఏ మలుపు తీసుకుంటుంది. అసలు దుర్గావతి ఆత్మ ఎందుకు చంచలను ఆవహించింది...దుర్గామతి కథేంటి...ఈశ్వర్ ప్రసాద్ చివరకు ఏమయ్యారు.. వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
  
ఎలా ఉందంటే...

రీసెంట్ గా కాంచన చిత్రం రీమేక్ ని లారెన్స్ డైరక్షన్ లో చేసిన అక్షయ్ కుమార్ ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు. లక్ష్మీ బాంబ్ సినిమా కు ఈ సినిమాకు పోలికలు ఉన్నాయి. ఏ కోణంలో ఉంటే సౌత్ ఇండియా సినిమాని హిందీకు తీసుకువచ్చేటప్పుడు మినిమం జాగ్రత్తలు తీసుకోపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందనే విషయంలో. నిజానికి భాగమతి సినిమాకి దుర్గామతికు పెద్ద తేడా ఏమీలేదు. రెండూ కథ,నటనలో జిరాక్స్ కాపీలే. అంతేకాదు ఈ సినిమా పబ్లిసిటి చేసినట్లుగా హారర్ థ్రిల్లర్ కాదు..ఓ పొలిటికల్ డ్రామా. మన సౌత్ ఇండియా రాజకీయాలకు, నార్త్ ఇండియా రాజకీయాలకు పూర్తి తేడా ఉంది. అలాంటప్పుడు అక్కడ పరిస్దితులును ఎడాప్ట్ చేసుకోవాలి. కానీ దర్శకుడు అశోక్ ..పూర్తిగా తెలుగు రీమేక్ కే కట్టుబడి ఉన్నాడు. ఎంతలా అంటే క్యారక్టర్స్ పేర్లు దగ్గరనుంచి భాగమతినే బాగా ఫాలో అయ్యాడు. ఇక క్లైమైక్స్ ట్విస్ట్ బాగా పేలాలి. దాన్ని నమ్ముకునే సినిమా చేస్తారు. అయితే హిందీలో సూపర్ నాచురల్ బిల్డప్ కాస్తా తేలిపోయింది. క్లైమాక్స్ కు కారు మబ్బులు కమ్మేసినట్లైంది. తమిళంలో కార్తీక సుబ్బారాజు చేసిన పిజ్జాకు కు ఇదో డీసెంట్ కాపీ అని గుర్తు పట్టేలా మారింది. ఏదైమైనా The Usual Suspects సినిమా ఇంకా భారతీయ సినిమాను ప్రేరేపిస్తూనే ఉందని అర్దమవుతోంది. ఇవన్నీ ప్రక్కన పెట్టి,కాస్త హారర్ ని క్లాస్ గా తెరకెక్కించి...సినిమాకు కీలకమైన ధర్డ్ యాక్ట్ ని మరింత టైట్ చేసుకుని ఉంటే గట్టెక్కేది. 

టెక్నికల్ గా..

సరైన స్క్రిప్ట్ అనేది సినిమాకు ముఖ్యమైన సాంకేతిక విభాగం. అక్కడే ఫెయిలైతే మిగతా విభాగాలన్నీ ఎంత గొప్పగా ఫెరఫార్మ్ చేసినా అవుట్ లుక్ అంత ఇంప్రెసివ్ గా ఉండదు. ఈ సినిమాకు అదే జరిగింది. డైరక్షన్ కూడా హిందీ సినిమాల స్దాయిని మ్యాచ్ చేయలేకపోయారు. ఇక్కడ రిలీజైన సినిమాని హిందీలో డబ్ చేసి చూసినట్లుంది. ఇక నటీనటుల్లో భూమి పెడ్నేకర్ విషయానికి వస్తే...ఆమె చాలా అద్బుతమైన నటి అనటంలో సందేహం లేదు. కానీ ఈ సినిమా చూస్తే ఆ స్టేట్మెంట్ మనం వెనక్కి తీసుకుంటాం. అంత పేలవంగా చేసింది. అనుష్క చేసిన నటనలో సగం కూడా చేసినట్లు అనిపించలేదు. ఈ సినిమాకు కంగన అయితే పూర్తి న్యాయం చేసి ఉండేదేమో అని కూడా ఆలోచనలు వస్తాయి.  అర్షద్ వార్సీ బాగా చేసారు. ఆయన రెగ్యులర్ గా చేస్తున్న రోల్స్ కు కాస్త భిన్నమైనదే. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చో్ట్ల బాగున్నా..మరి కొన్ని చోట్ల ఏదో చీప్ హారర్ సినిమాలో సీన్ల ..స్కోర్ తీసుకొచ్చి వేసారేమో అనిపించింది. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిమ్ చేయచ్చు.ఏదైమైనా భాగమతిని సెటైర్ చేసిన సినిమాలా అనిపించిందంటే ఏ స్దాయిలో ఉందో ఊహించుకోవచ్చు. 
 
 
 ఫైనల్ ధాట్

ఒరిజనల్ లోని ఆత్మ(సోల్) ఆవాహన రీమేక్ లో సరిగ్గా జరగలేదు
--సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:1.5

ఎవరెవరు

నటీనటులు:భూమి పెడ్నేకర్, అర్షద్ వర్షి, జిష్షు షేన్ గుప్త
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జి. అశోక్
నిర్మాత :విక్రమ్ మల్హోత్రా, భూషణ్ కుమార్, అక్షయ్ కుమార్, క్రిషన్ కుమార్
సంగీతం: జేక్స్ బెజోయ్
రన్ టైమ్:    2 గంటల 35 నిముషాలు
విడుదల తేదీ:    డిసెంబర్ 11, 2020