తెలుగు సినిమాలు డిజిటల్ రైట్స్, సాటిలైట్ రైట్స్ లో కొత్త మార్క్ క్రియేట్ చేస్తున్నాయి. రోడు రోజుకూ శాటిలైట్, డిజిటల్ మార్కెట్ లో కొత్త హైట్స్ కు రీచ్ అవుతున్నాయి. ఇటీవలే అల్లు అర్జున్ సినిమా ‘నా పేరు సూర్య...’ శాటిలైట్, డిజిటల్ మార్కెట్ విషయంలో పాతిక కోట్ల రూపాయల రేటు పలికి ఆశ్చర్యపరచగా.. ఇప్పుడు మహేశ్ బాబు సినిమా ‘భరత్ అనే నేను’  సంచలనం రేపుతోంది. తెలుగు సినిమాల పాత రికార్డులను అన్నింటినీ చెరిపేస్తూ ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఏకంగా రూ.39 కోట్ల రూపాయలు పలికాయని సమాచారం.

 

చాలా సినిమాల మేకింగ్ బడ్జెట్ కన్నా.. మహేశ్ బాబు నెక్ట్స్ సినిమా ఈ విషయంలో భారీ మొత్తం ధరను పలికినట్టే. మహేశ్ గత సినిమా ‘స్పైడర్’ నిరాశపరిచినా.. ఈ ప్రభావం ‘భరత్ అను నేను’పై ఏ మాత్రం పడలేదనే చెప్పాలి. స్పైడర్ ప్రీ రిలీజ్ మార్కెట్ లో దాదాపు 150 కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేసి.. బాక్సాఫీసు వద్ద మాత్రం ఆ మొత్తాన్ని సాధించలేకపోయింది. గత ఏడాది డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.
 

అయితే మహేశ్ బాబు- కొరటాల శివలది హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరి కాంబోలో ఇది వరకూ వచ్చిన ‘శ్రీమంతుడు’ సంచలన విజయం సాధించింది. బాక్సాఫీసు వద్ద భారీ మొత్తాన్ని వసూలు చేసింది ఆ సినిమా. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి చేస్తున్న ‘భరత్..’పై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ప్రీ రిలీజ్ వ్యాపారం భారీ స్థాయిలో జరుగుతోంది.