చాలా సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ అయ్యిపోయిన తరుణంలో ఊహించని విధంగా లాక్ డౌన్, కరోనా విజృంభణతో ధియోటర్స్ లాక్ అయ్యిపోయాయి. దాంతో ఎప్పటికి ఈ సమస్య తీరుతుందో చాలా మంది నిర్మాతలకు అర్దం కావటం లేదు. పెద్ద నిర్మాతలు అంటే ఏదో విధంగా మేనేజ్ చేసుకుంటూ వెళ్తారు కానీ, చిన్న వాళ్లకు వడ్డీలు కట్టాల్సిన పరిస్ది. దాంతో వాళ్ళంతా ఓటీటిల వైపు చూస్తున్నారు. ఇదే సమయంలో ఓటీటి లు సైతం క్యాష్ చేసుకోవాలని ఉత్సాహం చూపిస్తున్నాయి. ఆ క్రమంలో మొన్న వారం అమృతారామమ్ చిత్రం జీ5 ద్వారా రిలీజైంది. సినిమా పెద్దగా విషయం లేదని రిపోర్ట్ వచ్చింది. అయితే ఇప్పుడు మరో సినిమా కూడా ఓటీటి దగ్గర తామేంటో చూపించుకోవటానికి సిద్దపడుతున్నట్లు సమాచారం. 

అందాల రాక్షసి చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమ కి పరిచయం అయిన హీరో నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న భానుమతి రామక్రిష్ణ రిలీజ్ కానుంది.  ‘భానుమతి రామకృష్ణ’ అనే సినిమాను హాట్ స్టార్ కు అమ్మేశారు. త్వరలోనే ఇది ఆ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ కానుంది. అంటే ఆన్ లైన్ లో ఇంటి దగ్గరే చూసుకోవచ్చు. నిజానికి ఈ సినిమా గతేడాదే పూర్తయింది. అయినా ఎవరూ కొనకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. దీంతో లో బడ్జెట్ లో రూపొందిన ఈ సినిమాను హాట్ స్టార్ లో డైరెక్ట్ గా విడుదల చేయబోతున్నారు. అక్కడ కాస్త పాజిటివ్ టాక్ వస్తే తర్వాత శాటిలైట్ బిజినెస్ కు లైన్ క్లియర్ అవుతుందని నిర్మాతల నమ్మకం.  .

సలోనీ లుత్రా హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాకి కొత్త దర్శకుడు శ్రీకాంత్ నగోతి దర్శకత్వం వహించారు. రీసెంట్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని హాట్ స్టార్ యాజమాన్యానికి చూపించి ఓకే చేయించుకున్నట్లు చెప్తున్నారు.   మరికొద్ది రోజుల్లో ఈ సినిమాని హాట్ స్టార్ లో చూడబోతున్నాం అని అంటున్నారు. అమృతరామమ్ తర్వాత డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న చిత్రం ఇదే కానుంది.