ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు,  స్క్రీన్ రైటర్ బసు చటర్జీ(93) ఈ రోజు కన్నుమూశారు. వృద్ధాప్యం కారణాలతో గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బసు.. గురువారం తెల్లవారుజామున ముంబైలోని శాంటాక్రూజ్ నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ‘‘ఆయన ఈ ఉదయం నిద్రలో శాంతియుతంగా కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా కొంతకాలంగా బసు ఆరోగ్యం బాగాలేదు. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు”అని ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ (ఐఎఫ్​డీటీఏ) అధ్యక్షుడు అశోక్​ పండిట్ తెలిపారు. 

ఉస్ పర్, చిత్ చోర్, పియా కా ఘర్, ఖట్టా మీఠా, చోటీ సీ బాత్, రజనీగంధ, ఏక్ రుకా హువా ఫైస్లా, చమేలి కి షాదీ వంటి చిత్రాలకు బసు దర్శకత్వం వహించారు. చటర్జీ హిందీతో పాటు బెంగాలీ సినిమాల్లోనూ పనిచేశారు. 70 వ దశకంలో సూపర్ స్టార్లతో కలిసి సినిమాలు చేశారు. ఆయన సినిమాల్లో సున్నితమైన భావోద్వేగాలకు చోటు ఉంటుంది. ప్రేమని అత్యంత అద్బుతంగా తెరైప ఆవిష్కరించే దర్శకులలో ఆయన ఒకరు. కేవలం స్టార్స్ తో చేయాలనే తలంపుతో కాకుండా తన కథకు ఎవరైతే బాగుంటారో వారితో ప్రయాణం చేసేవారు బసు చటర్జీ. 

బసు మరణంపై బాలీవుడ్ సంతాపం వెల్లబుచ్చింది. ఇప్పటిదాకా దర్శకుడు అశ్విని చౌదరి, మధుర్ భండార్కర్, పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఏషియానెట్ కోరుకుంటోంది