నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో గతంలో 'జై సింహా' వచ్చింది. ఇప్పుడు మరోసారి ఇదే కాంబినేషన్‌లో కొత్త చిత్రం పట్టాలెక్కి షూటింగ్ జరుపుకుంటోంది. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌లో సి.కల్యాణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'రూలర్‌' అనే  టైటిల్  పరిశీలనలో ఉంది. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే కొన్ని స్టిల్స్ బయిటకు వచ్చి వైరల్ అయ్యాయి. అలాగే ఈ చిత్రం టీజర్ ని సైతం ఇప్పటికే కట్ చేసారని తెలుస్తోంది. బాలయ్య ఆమోద ముద్ర వేయించుకుని విజయదశమి రోజున ఈ టీజర్ ని వదలాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆఫీషియల్ ఎనౌన్సమెంట్ త్వరలో రానుంది.

అలాగే అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో బాలయ్య ఓ మాఫియా డాన్ గానూ, పోలీస్ అధికారి కానూ కనిపించనున్నారు. బాలకృష్ణ సరసన ఇద్దరు హీరోయిన్లు సోనాల్ చౌహాన్ అండ్ వేదిక నటించనున్నారు. అలాగే ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో నమితను తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నమిత నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తోందట. ముఖ్యంగా సినిమాలో బాలయ్యకి విలన్ గా కనిపించనుంది. అలాగే భూమిక ఈ సినిమాలో కీ రోల్ పోషించనుంది.

ఇప్పటికే సింహా సినిమాలో బాలయ్య సరసన నమిత నటించింది.   ఆగస్టు 7 నుండి బ్యాంకాక్‌ లో షెడ్యూల్  జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో బాలయ్య – సోనాల్ చౌహాన్ మరియు వేధికల సాంగ్స్ ను షూట్ చేసారు. అయితే సోనాల్ చౌహన్ మధ్య వయస్సులో ఉండే బాలయ్య పాత్రకు జోడీగా కనిపించనుంది. గతంలో ఈమె బాలకృష్ణతో కలిసి ‘లెజెండ్, డిక్టేటర్’ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ‘డిక్టేటర్’ తర్వాత ఆమె చేస్తున్న తెలుగు చిత్రం కూడా ఇదే కావడం విశేషం.

ఈ చిత్రానికి పరుచూరి మురళి కథను అందిస్తున్నారు. చిరంతన్‌ భట్‌ బాణీలు సమకూరుస్తున్నారు. రామ్‌ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ. రామ్‌లక్ష్మణ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫీ. చిన్నా ఆర్ట్‌ వర్క్‌ను అందిస్తున్నారు. త్వరలోనే ఇతర నటీనటుల వివరాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్‌ తెలియజేసింది.