బాలయ్య రీమేక్ చిత్రాల్లో నటించింది తక్కువే. ఆయన బాడీ లాంగ్వేజ్ కు సరిపడే కథలు ఇతర భాషల్లో అరుదుగా వస్తూంటాయి. అలాంటివి వచ్చినప్పుడు మాత్రమే ఆయనతో ఆ రీమేక్ లు ప్లాన్ చేస్తూంటారు. ఇప్పుడు అలాంటి సినిమా ఒకటి మళయాళంలో వచ్చింది. దాంతో ఈ సినిమా రైట్స్ కొని బాలయ్యతో చేయాలని ఫిక్స్ అయ్యారట. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. ఈ సినిమాలో మరో హీరో కూడా ఉంటారు. అలాంటి మల్టిస్టారర్ సినిమాలకు బాలయ్య ఎంతవరకూ ఒప్పుకుంటాడు అనేది చూడాల్సిన విషయం. ఇంతకీ ఆ మళయాళ చిత్రం ఏమిటి..దాని వివరాలు ఏమిటో చూద్దాం. 

స‌చీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` మ‌ల‌యాళంలో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇందులో పృథ్వీరాజ్‌, బీజు మీన‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ హీరోగా న‌టించాడు. ఈ చిత్ర రీమేక్ రైట్స్‌ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్య‌దేవ‌ర‌నాగ‌వంశీ ద‌క్కించుకున్నార‌ు. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారు. 

వారిలో  ఒక హీరో పాత్రకు నందమూరి బాలకృష్ణని అనుకుంటున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతానికి ఈ సినిమాకు డైరెక్టర్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఒకసారి ఫైనల్ అయ్యాకా బాలకృష్ణని సంప్రదించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే ఈ ప్రాజెక్టుని బి.గోపాల్ చేతిలో పెడితే ఎలా ఉంటుందని నిర్మాతలు ఆలోచిస్తున్నారట.  ఈ మేరకు టాక్స్ జరుగుతున్నాయట.

అలాగే ఈ సినిమాలో రెండో హీరో ఎవరు అనేది కూడా కీలకంగా ఉండబోతోంది. బాలయ్య లాంటి స్టార్ హీరోని తీసుకుంటే..ఆ రెండో హీరో ఎవరనేది ఖచ్చితంగా చూసి తీసుకోవాలి.  2019లో మూడు ప్లాపులు మూటగట్టుకున్న బాలయ్య... ప్రస్తుతం తనకు వరస హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఒక షెడ్యూల్  జరిగిన ఈ షూటింగ్.. కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ఆగింది. 

మరో ప్రక్క ..సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఇటీవలే నితిన్ నటించిన భీష్మ తో పెద్ద హిట్ అందుకుంది. అంతేకాకుండా వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.  ప్ర‌స్తుతం నితిన్ ,కీర్తి సురేష్‌ల‌తో రంగ్‌దే, నానితో శ్యామ్ సింగ‌రాయ్‌. నాగ‌శౌర్య‌తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రంగ్‌దే జులై 30న, శ్యామ్ సింగ‌రాయ్‌ డిసెంబర్ 25న (క్రిస్మస్ సందర్భంగా) విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.