ఎన్టీఆర్ బయోపిక్‌, రూలర్‌ సినిమాలతో నిరాశపరిచిన నందమూరి బాలకృష్ణ షార్ట్ గ్యాప్‌ తరువాత బ్లాక్‌ బస్టర్‌ కాంబినేషన్‌లో సినిమాతో చేస్తున్నాడు. తనకు సింహా, లెజెండ్ లాంటి బ్లాక్‌ బస్టర్ హిట్ అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నాడు. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాను బీబీ 2గా వ్యవహరిస్తున్నారు.

ఈ నెల 10న బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఫస్ట్ రోర్‌ పేరుతో రిలీజ్ చేసిన ఈ టీజర్‌లో బాలయ్య లుక్‌, క్యారెక్టరైజేషన్‌లు రివీల్ చేశారు. రూలర్‌ సినిమాలో బాలయ్య లుక్ విషయంలో విమర్శలు రావటంతో ఈ సినిమాలో లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. బాగా బరువు తగ్గి స్లిమ్‌ లుక్‌లో ఆకట్టుకున్నాడు.

ఇక అభిమానులు బాలయ్య నుంచి కోరుకునే మాస్ ఎలిమెంట్స్ ఏవీ మిస్‌ కాకుండా జాగ్రత్త పడ్డాడు. ముఖ్యంగా `ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో` అంటూ బాలయ్య చెప్పే డైలాగ్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాతో బాలయ్య బోయపాటి కాంబినేషన్‌లో మరో హిట్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.