అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయిన బిగ్గెస్ట్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్. ఇండియాలో దాదాపు అన్ని రీజినల్‌ లాంగ్వేజెస్‌లో ప్రసారం అవుతున్న ఈ షోపై ఎన్ని వివాదాలు వస్తున్నా.. అభిమానులు మాత్రం షోను ఆదరిస్తునే ఉన్నారు. అయితే ఈ షోపై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో అసలు బిగ్ బాస్‌ ఉంటుందా లేదా అన్న అనుమానాలు కలిగాయి. అయితే కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పటికే కొన్ని భాషల్లో బిగ్ బాస్‌ సందడి మొదలైంది.

దీంతో అన్ని భాషల్లోనూ బిగ్ బాస్‌ ప్రారంభమవుతుందని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్‌. కానీ సాండల్‌వుడ్‌లో మాత్రం ఈ ఏడాది బిగ్‌ బాస్ ఉండదన్న టాక్ వినిపిస్తోంది. కన్నడలో బిగ్‌ బాస్‌ షోకు కిచ్చా సుదీప్‌ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే 7 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో 8 వ సీజన్‌ ఉంటుందా లేదా అన్న అనుమానాలపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రతీ ఏడాది సెప్టెంబర్ నెలలోనే బిగ్‌ బాస్‌ ప్రారంబమవుతుంది. కానీ ఈ ఏడాది ఇంతవరకు కన్నడ బిగ్‌ బాస్‌కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు.

కలర్స్‌ కన్నడలో ప్రసారమయ్యే ఈ షోకు సంబంధించి ఇంత వరకు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టకపోవటంతో ఇక షో ఉండదన్న టాక్‌ వినిపిస్తోంది. గత ఆరు నెలలకు కన్నడ స్టార్స్‌ అంతా షూటింగ్‌లకు దూరంగానే ఉన్నారు. ఇప్పటికీ అక్కడ సినిమా యాక్టివిటీ ఇంకా మొదలు కాలేదు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్‌ లాంటి భారీ షో సెట్స్ మీదకు వచ్చే అవకాశమే లేదంటున్నారు విశ్లేషకులు. అయితే ఈ షో మార్చ్‌ 2021కి పోస్ట్ పోస్‌ అయ్యిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ వార్తలపై షో నిర్వాహకులు స్పందించాల్సి ఉంది.