సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసు బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన మరణం మిస్టరీగా మారి అది కాస్త డ్రగ్స్ కేసు వైపు మలుపులు తీసుకుంది. ఈ క్రమంలో దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లపై ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో  వారిని విచారించింది. దీనిపై దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. 

ఇందులో అరెస్ట్ అయిన సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తి ఇటీవలే బెయిల్‌పై విడుదలైంది. తాజాగా మరో అరెస్ట్ చోటు చేసుకుంది. బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ లవర్‌ గాబ్రియెల్లా డెమెట్రియెడ్స్ సోదరుడు అగిసిలాస్‌ని అరెస్ట్ చేశారు. దక్షిణాఫ్రికా జాతీయుడైన అగిసిలాస్‌ డ్రగ్ సరఫరా దారులతో సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపత్యంలో ఎన్‌సీబీ అతన్ని రిమాండ్‌లోకి తీసుకుంది. మొదట కోర్ట్ లో హాజరుపరిచి అనంతరం కస్టడీలోకి తీసుకున్నారు. 

సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ జూన్‌ 14న ముంబాయిలోని బాంద్రాలో ఉన్న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ కేసు  పలు మలుపులు తిరుగుతోంది.  మాదకద్రవ్యాలకు సంబంధించిన పలు ఆరోపణలు తెరపైకి వచ్చిన తరువాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అభ్యర్థన మేరకు ఎన్‌సీబీ కేసు నమోదు చేసింది.  మరోవైపు సీబీఐ సైతం విచారణ జరుపుతోంది. మరి ఈ కేసులో ఇంకెంత మంది పేర్లు బయటకు వస్తాయో చూడాలి.