ప్రభాస్ వంటి రెబల్ హీరోకు ఎలాంటి విలన్ కావాలి. సాఫ్ట్ గా ఉండేవాడా..లేక కండలు తిరిగి ఫైట్స్ తో చెలరేగిపోయేవాడా..అంటే ఎలా ఉన్నా కథను అనుసరిస్తూ ..కొత్తదనం ప్రజెంట్ చేసేవాడు కావాలి అంటారు. అలాగే కాస్త మనకు తెలిసున్న ఫేస్ అయితే ఇంకా బెస్ట్ అంటారు. సాహో సమయంలో విలన్ ఎవరో తెలియటానికే చాలా టైమ్ పట్టేసింది చూసేవాళ్లకు. దాంతో తెరపై ఏం జరుగుతోందనే విషయం అర్ద కావటానికి సమయం తీసుకుంది. అది రిజల్ట్ పై పడింది. అందుకే ఈ సారి అలాంటి పొరపాటు జరగకూడదు అని ప్రభాస్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన తదుపరి చిత్రంలో విలన్ గా ఒకప్పటి హ్యాండసమ్ హీరో ..అమ్మాయిల లవర్ బోయ్ అయిన అరవింద్ స్వామిని ఎంచుకున్నట్లు సమాచారం. అరవింద్ స్వామి ఇప్పటికే తెలుగువారికి ధృవ చిత్రంతో తనలోని విలనీ యాంగిల్ ని చూపించి అదరకొట్టారు. 

 వివరాల్లోకి వెళితే...ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక భారీ చిత్రాన్ని రూపొందించనున్న సంగతి తెలిసిందే. 
ఈ సినిమాలో  విలన్ గా ఎవరిని తీసుకోనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే అరవింద్ స్వామి పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల  కాలంలో స్టైలీష్ విలన్ పాత్రలకు అరవింద్ స్వామి కేరాఫ్ అడ్రెస్ గా మారాడు. సోషియో   ఫాంటసీని టచ్ చేస్తూ నడిచే ఈ కథలో విలన్ పాత్రకు ప్రత్యేకమైన క్యారక్టరైజేషన్ ఉంటుందిట. 

చాలా కూల్ గా ఉంటూ ప్రపంచానికి అతి మంచివాడు అనిపించుకుంటూ వెనక కథ నడిపిస్తూ ఉంటాడట. ప్రభాస్ సినిమా కోసం ఫోన్ లోనే అరవింద్ స్వామిని సంప్రదించినట్టు తెలుస్తోంది.  భారీ ప్రాజెక్టు కావడం .. తను ఎంతగానో ఇష్టపడే స్టైలీష్ విలన్ పాత్ర కావడం వలన అరవింద్ స్వామి అంగీకరిస్తాడని చెప్తున్నారు. కరోనా ప్రభావం తగ్గితే...డిసెంబర్లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. 

వైజయంతీ మూవీస్  బ్యానర్ పై భారీ తారాగణంతో ఈ సినిమాను నిర్మించనున్నారు. వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ప్లానింగ్ ఉండటంతో, బాలీవుడ్ హీరోయిన్స్ ను ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.