అనుష్క నటించిన తాజా చిత్రం భాగమతి ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. భాగమతి తమిళ వెర్షన్ ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో ఘనంగా జరిగింది. తాజాగా భాగమతి మూవీ ప్రమోషన్ లో భాగంగా.. మూవీ విశేషాలతోపాటు తన పెళ్లికి సంబంధించి కూడా ఆసక్తికర కామెంట్లు చేసింది. ముఖ్యంగా ప్రభాస్ కు, తనకు మధ్య అనుబంధం గురించి కూడా అనుష్క ఈ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇంతకీ అనుష్క ఏం చెప్తోంది.


‘భాగమతి’ సినిమా గురించి చెబుతూ.. ‘‘ఈ సినిమా గురించి ఎక్కువగా చెప్పను. తెరపైనే చూడండి. భలే థ్రిల్‌గా ఉంటుంది. దర్శకుడు అశోక్‌ ఈ సినిమా కథను 2012లోనే చెప్పారు. కానీ అప్పటికే నేను ‘బాహుబలి’ సీరిస్, ‘లింగా’, ‘సైజ్‌ జీరో’ సినిమాలతో బిజీగా ఉన్నాను. అయితే, ఇది నిజ జీవిత ఘటనలు ఆధారంగా తీసిన సినిమా కాదు.

 

నాకు థ్రిల్లర్ సినిమాలు పెద్దగా నచ్చవు. కానీ కథ నచ్చడం వల్ల ఆ సినిమాలకే కమిట్ అవుతున్నా. నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి నన్ను ‘అరుంధతి’ సినిమాకు ఎంపిక చేశారు కాబట్టే నాకు అలాంటి పాత్రలు చేయగలగుతున్నా. ఆయన లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్నే కాదు. అయితే, నాకు రొమాంటి సినిమాలు చేయాలని ఉంది’’ అని అనుష్క తెలిపింది. మరోసారి దర్శకుడు రాజమౌళితో పనిచేయాలని ఉందని అనుష్క తన మనసులో మాట చెప్పింది. ప్రస్తుతం గౌతమ్ మీనన్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు తెలిపింది.

 

మీ పెళ్లి, ప్రభాస్‌తో స్నేహంపై చాలా వదంతులు షికారు చేస్తున్నాయనే ప్రశ్నకు అనుష్క సమాధానం ఇస్తూ.. ‘‘ఔను, ఈ మధ్య అందరూ నా పెళ్లి గురించే అడుగుతున్నారు. అయితే, ప్రభాస్‌ నాకు మంచి మిత్రుడు మాత్రమే. అలాగని అతన్ని అన్నయ్య అని పిలవలేను. అబ్బాయిలందరినీ మనం అన్నయ్యగా భావించలేం కదా?’’అంది. అయితే, తనకి వార్తలు చదివే అలవాటు పెద్దగా లేదని, అందుకే తన గురించి ఎలాంటి వార్తలు వస్తున్నాయో తనకు తెలియని చెప్పింది.

 

ఇక నీ పెళ్లి ఎప్పుడు అనుష్క అంటే.. ‘‘సినిమాల్లో పడి, పెళ్లి గురించి ఆలోచించడమే మానేశా. నా కోసం ఓ అబ్బాయిని వెతికి పెట్టండి.ప్లీజ్’’ అంటూ నవ్వులు చిందించింది.