మహమ్మారి వైరస్ భారతదేశంలో ప్రమాదకర రీతిలో వ్యాపిస్తోన్న సంగతి తెలిసిందే. రికార్డుల మేర కేసులు పెరుగుతున్నాయి. ఈ కేసుల సంఖ్య రోజురోజుకు మరింత ఉధృతమవుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 28637 పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కేసులు పెరగడం తప్ప తగ్గడం లేదు. మరో ప్రక్క బాలీవుడ్ ప్రముఖులనుకూడా ఈ వైరస్  వదలడంలేదు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కరోనా బారినపడడం బీ-టౌన్ వర్గాలను కలవరపాటుకు గురిచేస్తోంది.

తాజాగా ప్రముఖ నటి రేఖ సెక్యూరిటీ గార్డుకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దాంతో ముంబయి మున్సిపల్ అధికారులు రేఖ బంగ్లాకు తాళం వేశారు. ఇక అనుప‌మ్ ఖేర్ కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విష‌యాన్ని తెలుపుతూ అనుపమ్ ఖేర్ ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేశారు. తన తల్లి దులారి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతోందని, దీంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ల‌డంతో కరోనా ఉన్న‌ట్లు నిర్ధారణ అయిందని చెప్పారు.


https://twitter.com/AnupamPKher/status/1282181222467162118

ఆమెలో క‌రోనా ల‌క్ష‌ణాలు త‌క్కువ‌గా ఉన్నాయని అనుపమ్ ఖేర్ చెప్పారు. ప్ర‌స్తుతం ఆమెకు ముంబైలో కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని తెలిపారు. అనంతరం తన సోదరుడు రాజు ఖేర్‌, మ‌ర‌ద‌లు, మేన‌కోడ‌లుకి కూడా క‌రోనా నిర్ధార‌ణ అయిందని చెప్పారు. ప్రస్తుతం వారు నలుగురి  ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉందని చెప్పారు.

బీఎంసీ అధికారులతో పాటు వైద్యులు తమకు  సహ‌క‌రించారని అనుపమ్ ఖేర్ తెలిపారు. తాను కూడా కరోనా ప‌రీక్ష చేయించుకున్నానని,  నెగిటివ్ అని తేలిందని వివరించారు. ప్ర‌స్తుతం తాము హోం క్వారంటైన్‌లో ఉన్నామని, తన సోద‌రుడి ఇంటిని శానిటైజ్ చేస్తున్నారని ఆయన వివరించారు.