తెలుగు టీవి నటీనటులని,   సాంకేతిక నిపుణులను కరోనా వైరస్ వణికిస్తూనే ఉంది. ఇప్పటికే పలువురు టీవీ స్టార్స్ కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే. తాజాగా మరో నటుడు కూడా తనకు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యిందనే విషయాన్ని ఒక వీడియో ద్వారా ప్రకటించాడు. స్వాతి చినుకులు మరియు బంధం వంటి సీరియల్స్ లో కీలక పాత్రల్లో కనిపించిన నటుడు భరద్వాజ్ రంగావిజ్జుల ఎలాంటి లక్షణాలు లేకున్నా కూడా అనుమానంతో కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అంటూ రిపోర్ట్ వచ్చిందట. దాంతో ఆయన సోషల్ మీడియా ద్వారా విషయాన్ని షేర్ చేశాడు.

నటుడు భరద్వాజ్ రంగావిజ్జుల ...స్వాతిచినుకులు, బంధం అనే టీవీ సీరియళ్ల ద్వారా ఆయన ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. తనకు కరోనా రావటంతో తనతో కలిసి నటించిన వాళ్ళు  ఐసోలేషన్ లో  ఉండాలని సూచించాడు.   

గత రెండు వారాలుగా స్వాతిచినుకులు మరియు బంధం సీరియల్స్ లో నాతో కలిసి నటించిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి పరీక్షలు చేయించుకోండి. ఇది ఏమీ ఆందోళన కలిగించే విషయం కాదు. ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ గా ఉండాలి. రహస్యంగా దాచి పెట్టడం వల్ల ప్రమాదం మరింతగా పెరుగుతుంది. పాజిటివ్ అంటూ తెలిసిన వెంటనే భయాందోళనకు గురి అవ్వాల్సిన పని లేదు. మెడిటేషన్ చేయడంతో పాటు సరైన ఆహారం తీసుకోవడం వల్ల కరోనా నుండి ఈజీగానే బయట పడవచ్చు.

జాగ్రత్తలు పాటిస్తూ సామాజిక దూరంను పాటించడం వల్ల వైరస్ బారిన పడకుండా ఉండవచ్చు. అలాగే మీరు ఇతరులకు వైరస్ అంటించని వారు అవుతారు. ఈ సమయంలో నాకు మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. తనకు ఏ విధంగా వైరస్ అంటి ఉండవచ్చు అనే విషయాన్ని చెప్పలేనన్నాడు. అయితే ఇది ప్రతి ఒక్కరికి ఈజీగా సోకే ప్రమాదం ఉందని కనుక జాగ్రత్తలు పాటించడం మంచిదనే అభిప్రాయంను భరద్వాజ్ వ్యక్తం చేశాడు.

హైదరాబాద్ లో కరోనా వ్యాప్తి మరీ ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కేసులు హైదరాబాద్ నుండే వస్తున్నాయి. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా ఉధృతి ఆగట్లేదు. సాధారణ ప్రజలతో పాటు అధికారులు, పోలీసులు, సెలబ్రిటీలు సైతం కరోనా భారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. రీసెంట్ గా షూటింగ్ లకు అనుమతివ్వటంతో నగరంలో సినిమా, సీరియల్ షూటింగ్ లు ప్రారంభమయ్యాయి. షూటింగ్ ల సమయంలో సభ్యులు కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నప్పటికీ కరోనా భారిన పడుతున్నారు.