బాలీవుడ్ డ్రగ్స్ కేసులో శనివారం మరికొన్ని అరెస్టులు చోటు చేసుకున్నాయి. డ్రగ్స్ సరఫరా చేసిన కరమ్ జీత్‌ను ఎన్‌సీబీ అదుపులోకి తీసుకుంది. రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి, మిరాండాలకు కరమ్ డ్రగ్స్ సరఫరా చేశాడు.

ఇతనితో కలిపి మొత్తం ఏడుగురు పెడ్లర్‌లను అధికారులు విచారిస్తున్నారు. వీరి వద్ద నుంచి పెద్ద మొత్తంలో మత్తు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. వీరికి డ్రగ్స్ ఎలా వచ్చాయి. ఎవరి కోసం సరఫరా చేస్తున్నారనే కోణంలో విచారణ జరుగుతోంది.

రియా అరెస్ట్ తర్వాత డ్రగ్స్ కేసును ఛేదించే పనిలో పడింది ఎన్‌సీబీ. రియా చెప్పిన వివరాలతో ఇవాళ ముంబై, గోవాలలో సోదాలు నిర్వహించింది. గోవా నుంచి డ్రగ్స్ సరఫరా అయినట్లు గుర్తించిన అధికారులు డ్రగ్స్ పెడ్లర్స్ వివరాలు ఆరా తీస్తోంది.

మాదక ద్రవ్యాలు గోవా నుంచి సుశాంత్ ఇంటికి, ఆ తర్వాత సుశాంత్ ఇంటి నుంచి రియా ఫ్లాట్‌కు వెళ్లినట్లు ఎన్‌సీబీ గుర్తించింది. రియా పలువురు సినీ సెలబ్రిటీలకు డ్రగ్స్ విక్రయించినట్లు పక్కా ఆధారాలను సేకరించింది.