నువ్వు సూపరప్ప: ‘ఆండ్రాయిడ్‌ కట్టప్ప’ రివ్యూ

వరస పెట్టి మళయాళ డబ్బింగ్ సినిమాలు వారానికొకటి చొప్పున  'ఆహా' యాప్ లో రిలీజ్ చేస్తున్నారు .  మళయాళంలో మంచి విజయం సాధించిన సినిమాలు ఏరి డబ్బింగ్ చేస్తూండటంతో  ఇక్కడా వాటికి మంచి ప్రజాదారణే దక్కుతోంది. ముఖ్యంగా రెగ్యులర్ కథలతో విసుగెత్తిపోయిన తెలుగువారికి విభిన్న కథాంశాలు ఈ మళయాళ సినిమాలతో పరిచయం అవుతున్నాయి. మొన్న జల్లికట్టు సినిమాతో వచ్చిన ఆహా  తాజాగా  గతేడాది మలయాళంలో విడుదలై అక్కడి ప్రేక్షకులను అలరించిన  ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25’ సినిమాని తెలుగులో  ‘ఆండ్రాయిడ్‌ కట్టప్ప’ టైటిల్ తో డబ్ చేసి విడుదల చేసారు. టైటిల్ లోనే వెరైటీ ఉన్న ఈ సినిమా కథేంటి....రోబో కు కట్టప్ప అనే పేరెందుకు వచ్చింది..ఈ రోబో కు శంకర్ రోబో కు ఏమన్నా సంభందం ఉందా వంటి  విషయాలు రివ్యూలో చూద్దాం. 

Android Kattappa  Version 5.25 Movie Review


కథేంటి

భాస్కరరావు  అనే ఓ పెద్దాయన.. భార్యను పోగొట్టుకొని ఉన్న ఒక్కగానొక్క కొడుకు సుబ్రమణ్యతో జీవిస్తుంటాడు. ఆయనకు కాస్తంత ఛాదస్తం పాలు ఎక్కువే అని చెప్పాలి. ప్రతీదీ తను అనుకున్నట్లే జరగాలి...ఏ విషయంలోనూ రాజీ పడని మనస్తత్వం. దానికి తోడు కొద్దిగా ప్రాణభయం. అది పైకి వ్యక్తీకరించడు. పాపం ఆ పెద్దాయన కొడుకు  సుబ్రమణ్యం  మెకానికల్ ఇంజినీరింగ్  చదువుకున్నా ఉద్యోగం,సద్యోగం లేకుండా తండ్రికు వండిపెడుతూ అలాగే ఉండిపోతాడు.  కానీ లోపల ఉండే ఆ తపన అతన్ని కుదురుగా ఉన్నవ్వదు. దాంతో ఉద్యోగాలకు అప్లే చేస్తూంటాడు. చివరకు రష్యాలో ఓ జపనీస్ కంపెనీలో జాబ్ వస్తుంది. 

అలా ఊరుని,తనని వదిలేసి వెళ్లటం ఆ పెద్దాయనకు ఇష్టం లేదు. కానీ కొడుకుతో అదే టాపిక్ మాట్లాడి ఎంతసేపు అని విభేధించగలడు...నిష్టూరాడగలడు. కొడుకుకి అలా తండ్రిని ఒంటరిగా ఆ పెద్ద ఇంట్లో వెళ్లాలని లేదు. ముఖ్యంగా ఆ వయస్సులో షుగర్,బిపీలతో బాధపడుతూ వంట చేసుకుంటూ ఎలా ఉంటాడు. వేరే చోటకు వెళ్లినా తనకు బెంగే. అప్పుడు ఇంట్లో ఉండే వంటమనిషిని వెతుకుతాడు. కానీ పెద్దాయన...ఇంట్లో ప్రిజ్ కానీ, మిక్సీ గానీ , చివరకు టీవి కూడా లేకపోవటం, ఆయన మాట మాటకి విసుక్కునే తత్వం నచ్చక ఎవరూ సెట్ కారు. రెండు రోజులు పనిచేసి నమస్కారం పెట్టేస్తూంటారు. 

ఏం చేయాలి..తన తండ్రిని ఆ ఇబ్బంది నుంచి ఎలా బయిటపడేయాలి లేదా తను ఎలా మనశ్సాంతి  గా  ఉండాలి అనే ఆలోచనలోనే అక్కడికి వెళ్తాడు. అయితే అక్కడకి వెళ్లాక ..ఓ సగం జపనీస్ అమ్మాయి పరిచయం అవుతుంది. అంటే మిగతా సగం తెలుగు అన్నమాట (వాళ్ల నాన్న తెలుగు). దాంతో ఈ తెలుగు కుర్రాడుకి ఇట్టే ఎట్రాక్ట్ అవుతుంది. ఆ క్రమంలో అతని బాధను అర్దం చేసుకుంటుంది.  ఓ ఆలోచన చేస్తారు. టెక్నాలజీతో ఈ సమస్యను పరిష్కరించాలనుకుంటాడు. 

  ఇంటిదగ్గర ఒంటరిగా ఉన్న తండ్రికి సహాయంగా ఉండేందుకు ఒక హ్యూమనాయిడ్ రోబోను తన వెంట తీసుకెళతాడు. ఆ రోబో..ఆ పెద్దాయన కు అన్ని పనులూ చేసిపెడుతుంటుంది.  టైమ్ కు టీ ఇస్తుంది. తలారా స్నానం చేస్తే తల తుడుస్తుంది. అవసరమైతే కాళ్లు నొక్కుతుంది. మొదట్లో ఆ రోబోని వ్యతిరేకించినా కొన్నాళ్ళకు రోబో .. ఎడిక్ట్ అయ్యిపోతాడు. దానికి  కట్టప్ప అనే పేరు పెడతాడు. దానితోనే ఎక్కువ అటాచ్ మెంట్ పెట్టుకుంటాడు. చివరికి ఆ ఎటాచ్ మెంట్ ఏ పరిస్దితులకు దారి తీసింది. కట్టప్ప అని రోబోకు పేరు పెట్టడానికి గల కారణం ఏమిటి.. చివరకు ఆ కథ ఎలా ముగిసింది అనేదే మిగతా కథ.

ఎలా ఉంది...

2012  వచ్చిన హాలీవుడ్ ఫిల్మ్ రోబోట్ అండ్ ఫ్రాంక్ ఆధారంగా దర్శకుడు రతీష్ బాలకృష్ణన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇదీ తండ్రీకొడుకుల కథ.  ఓ యంత్రానికి, మనిషికి మధ్య జరిగిన కథ. ఎక్కడా బోర్ కొట్టనీయకుండా ఫన్ తో ఆద్యంతం సినిమాని నడిపించాడు దర్శకుడు.  ఇప్పుడు చాలా కుటుంబాల్లో పెద్దవాళ్లు ఎదుర్కొంటున్న ఒంటిరితనం, పిల్లలు తండ్రులను వదలలేక...తమ కెరీర్ ని వదులుకోలేక పడే బాధను చక్కటి ఎమోషన్స్ తో పండించారు.  ‘మిక్సీ వద్దు.. గ్రైండర్‌ వద్దు.. ప్రిడ్జ్‌ వద్దు.. ఫోన్‌ వద్దు.. టీవీ వద్దు.. మనుషులు వద్దు.. చివరికీ రోబో కూడా వద్దు.. అసలు నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావ్‌ నాన్న’ అంటూ తన తండ్రిని ఉద్దేశిస్తూ ఆవేదనగా కొడుకు చెప్పే డైలాగు ప్రతీ మనస్సున్న కొడుకూ ఐడింటిఫై చేసుకుంటారు.

అలాగే శంకర్ రోబో 2.0 చిత్రాన్ని కేవలం  రోబో..మనిషి జర్ని అనే థీమ్ దాకానే గుర్తు చేస్తుంది. ఆ సినిమాకి ఈ సినిమాకూ పోలిక ఉండదు.  అలాగే అక్కడక్కగా అవకాసం ఉన్నప్పుడల్లా సమకాలీన సమాజంపై సెటైర్స్ పడుతూనే ఉంటాయి. ఇందులో పేపర్ బోయ్...ఫేస్ బుక్ లో కమ్యూనిస్ట్ , అయ్యప్ప డివోటీ సంఘం రెండింటికి లైక్ కొడతాడు.  అలాగే బ్రూస్ లీ ఫొటో చూసి వేరే ఎవరో అనుకోవటం. రోబోని చూడటానికి ప్రక్క వీధి వాళ్లు వచ్చి...మీ రోబోకు బట్టలు వేయండి కాస్తంత అని అనటం, ఆ రోజు నక్షిత్రం తెలుసుకోవాలంటే దాన్నే అడగటం. గుడికి దాన్ని సంప్రదాయ బద్దమైన డ్రస్ లో తీసుకెళ్లికే అక్కడ పూజారి ఆపటం..అప్పుడు రోబో..భగవత్గీత..వేదాలు, ఉపనిషత్తుల చెప్పటం..వాళ్లంతా ఆశ్చర్యపోవటం వంటివి ఈ సినిమాలో బోలెడు ఉన్నాయి. 
  
టెక్నికల్ గా ...

ఈ సినిమా కామెడీ సైన్స్ ఫిక్షన్. అందుకు తగినట్లే ఉంటుంది.  ఆండ్రాయడ్ కట్టప్పని చూస్తూంటే అది రోబో వేషంలో ఉన్న మనిషి అని గుర్తు పట్టచ్చు.  స్క్రిప్టు ప్రధానంగా సాగే సినిమా ఇది. భారీ బడ్జెట్ లేకుండా సింపుల్ గా ఓ విలేజ్ లో లాగేసారు. ఇంకా చెప్పాలంటే స్పీల్ బర్గ్ ఈటీ సినిమా గుర్తుకు వస్తుంది. ఇక ఈ సినిమా కెమెరా వర్క్ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఆర్ట్ వర్క్ ..దర్శకుడు వ్యంగ్యానికి దగ్గరగా ఉంది. ఎడిటింగ్ కూడా బాగుంది.  నటీనటుల్లో భాస్కరరావు గా సురాజ్ వెంజారమూడ్ అదరగొట్టాడు. ఈ నలభై ఏళ్ల నటుడు...డబ్బై ఏళ్ల ముసలాయనగా మైమరిపిస్తాడు. ఎక్కడా మనకు ఆ తేడా కనపడనివ్వడు. మిగతా ఆర్టిస్ట్ లు కూడా చాలా పరిణితితో చేసారు. 
 
ఫైనల్ థాట్..


 పెద్ద తెరపై రిలీజ్ చేస్తే మంచి హిట్ అవుతుంది
  రేటింగ్ : 3.5 /5
--సూర్య ప్రకాష్ జోశ్యుల

------
నటీనటులు : సురాజ్ వెంజారమూడ్, సౌబిన్ షాహిర్, మాలా పార్వతి, సైజు కురుప్పు, రాజేష్ మాధవన్, ఉన్నిరాజా, శివదాస్ కణ్ణూర్ తదితరులు
నిర్మాణం: సంతోష్ టి.కురువిల్లా
దర్శకత్వం : రతీష్ బాలకృష్ణన్ పొదువాల్
ఎక్కడ చూడాలి?: ఆహా
రిలీజ్ డేట్:  09-10-2020
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios