Asianet News TeluguAsianet News Telugu

‘అండ్‌ ది ఆస్కార్‌ గోస్ టు..’ మూవీ రివ్యూ

టోవినో థామస్‌  కీలక పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘అండ్‌ ది ఆస్కార్‌ గో టు’. అను సితార హీరోయిన్. సలీమ్‌ అహ్మద్‌ దర్శకుడు. గతేడాది మలయాళంలో విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు ‘ఆహా’ ఓటీటీ వేదికగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

And the Oscar Goes To telugu ott Movie Review
Author
Hyderabad, First Published Aug 28, 2020, 3:40 PM IST

సినిమా అనేది చాలా మందికి జీవితం. తాము కలగన్నది తెరకెక్కించి, దాన్ని ప్రపంచం చూసి మెచ్చుకోవాలని, పెట్టుబడి పెట్టిన నిర్మాతకు లాభం తెప్పించాలని ఆశిస్తారు. అయితే అందరికీ కల నెలవేరదు. మరీ ముఖ్యంగా ఆ కల ...తమ సినిమాకు ఆస్కార్ అవార్డ్ పొందాలి అనుకునే స్దాయిలో ఉంటే మరీ కష్టం. మళయాళంలో 2019 లో ఇదే టైటిల్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగులో డబ్బింగ్ చేసి, ఆహా ఓటీటి వారు మనకు అందిస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉంది,అసలు కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

ఇదే కథ:
చిన్నప్పటి నుంచి సినిమానే శ్వాసగా పెరుగుతాడు ఇస్సాక్ ఇబ్రహం (టోవినో థామస్‌). అసలు అతను పుట్టినప్పుడే తమ నర్శింగ్ హోమ్ కు ప్రక్కన సినిమా థియోటర్ ఉండటంతో మొదటగా సినిమా డైలాగులే వింటాడు. అలా సినిమాతో మొదలైన అతని జీవితం పెద్దయ్యాక పెద్ద డైరక్టర్ అవ్వాలనే కలగా మారుతంది. అయితే రెగ్యులర్ కమర్షియల్ సినిమా తీయాలనుకోడు. తాను చూసిన యధార్ద సంఘటనలను తెరకెక్కించాలి...ప్రపంచం మెచ్చుకునే ఆస్కార్ సాధించాలనుకుంటాడు. అయితే అతను చెప్పిన కథ  ఏ నిర్మాతకు నచ్చదు. దాంతో వేరే దారి లేక తన ప్రాపర్టీ లను అమ్మి, తాకట్టు పెట్టి తన కలను నిర్మించటం మొదలెడతాడు. 

ఆర్దిక నష్టాలు మధ్యలో భయపెట్టినా, ఇబ్బందులు బాధ పెట్టినా సినిమా దిగ్విజయంగా పూర్తి చేస్తాడు. అయితే ఆ సినిమాని ఆస్కార్ కు తీసుకెళ్లానుకున్న చోటే ఇబ్బందులు ఎదురౌతాయి. మరి ఇస్సాక్...ఆ కోరిక నెరవేర్చుకున్నాడా..ఆస్కార్ సాధించాడా...ఆ క్రమంలో ఏ ఇబ్బందులు పడ్డాడు..వాటిని ఎలా అధిగమించాడు వంటి విషయాలు తెలియాలంటే ఆహా యాప్ లో  సినిమా చూడాల్సిందే. 
 
ఎలా ఉందంటే:
ప్రవాహంలో కొట్టుకుపోవటం ఈజీనే. కానీ విభిన్నమైన సినిమా తీయటం, దాన్ని జనాలకు చేరువ చేయటమే కష్టం అని ఈ సినిమా సారాంశం. ఈ సినిమా చూస్తూంటే మనకు అదే అనిపిస్తుంది. ఈ సినిమా చూస్తూంటే సినిమా కష్టాలపై తీసిన డాక్యుమెంటరీ అనిపిస్తుంది. మరో ప్రక్క సినిమా తీయటం అనేది అనుకున్నంత ఈజీ కాదని, దాని వెనుక ఎన్నో కష్ట,నష్టాలు ఉంటాయని అర్దమవుతుంది. దర్శకుడు సలీమ్ అహ్మద్ తన సొంత అనుభవాలనుంచి ప్రేరణ పొంది ఈ సినిమా చేసారని అర్దమవుతుంది. 

 సలీమ్ అహ్మద్ మొదట చిత్రం  'Adaminte Makan Abu' నేషనల్ అవార్డ్ , కేరళ స్టేట్ అవార్డ్  పొందింది. అలాగే 84వ ఆస్కార్ అవార్డ్ లకు మన దేశం పంపబడిన రీజనల్ సినిమాగా ఎంపికైంది. అప్పుడు తన కళ్లెదురుగా జరిగిన సంఘటనలు, వాస్తవ పరిస్దితులు ఆయనకు బాధ కలిగించి ఉంటాయి. ఓ సినిమాని ప్రపంచం మెచ్చుకునే ఆస్కార్ స్టేజీపైకు తీసుకెళ్లాలంటే ఎంత కష్టమో ..అదీ హాలీవుడ్ కాని వారికి ఎన్ని ఇబ్బందులు పడాలో తెలిసినట్లుంది. ఆ ఆవేదనను ఆయన సీన్స్ రూపంలో పెట్టి మనకు అందించారు. అయితే ఆయన ఆవేదన, నిజాయితీ మనకు చాలా చోట్ల మనస్సుకు హత్తుకుంటుంది. కానీ చాలా స్లోగా విషయం చెప్పటం, ఎంతకీ కథ ముందుకు కదలకపోవటం, ఒకే విషయం చుట్టూ చక్కర్లు కొట్టడం వంటివి మనకు సినిమాపై పెద్దగా చెప్పుకోదగ్గ ఇంట్రస్ట్ ని అయితే కలిగించవు. 

స్క్రీన్ ప్లే ని మరింత ఇంట్రస్టింగ్ గా రాసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. సినిమా చూస్తున్న మనకు హీరో ఎలాగైన అడ్డంకులు తొలిగించుకుని ఆస్కార్ కొడితే బాగుండును అనిపించే ఎమోషన్ అయితే కలిగించారు. ముఖ్యంగా ఇసాక్ లోని ఫ్యాశన్ మన మనస్సుకు హత్తుకుంటుంది. అదే సమయంలో మళయాళ సీనియర్ నటుడు సలీమ్ కుమార్ కూడా తన అద్బుతమైన నటనతో మనను కట్టిపారేస్తాడు. హీరోయిన్ గా చేసిన అను సైతం వేరే వాళ్లు ఆ పాత్రను అంత ఈజ్ తో చేయలేరనిపించేలా చేసింది. ఎన్ని చేసినా సెకండాఫ్ లో కాస్తంత డ్రామా ఎక్కువైందనిపించటం, పీఆర్ ఏజెంట్ ,హాలీవుడ్ కాన్వర్షేషన్స్, సిట్యువేషన్స్, సీక్వెన్స్ లు ఎక్సిక్యూషన్ ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. 
  
ఫైనల్ థాట్
గొప్ప సినిమాకు ఆస్కారే పరమావిధి కాదు...ఆస్కార్ వచ్చిన సినిమాలన్ని గొప్ప సినిమాలు కావు..అని ఈ డైరక్టర్ కు ఎవరైనా చెప్తే బాగుండను అనిపిస్తుంది. 

---సూర్య ప్రకాష్ జోశ్యుల

Rating: 2.5 / 5

ఎవరెవరు:
నటీనటులు :టోలీనో థామస్, నిక్కీ, అను సితార, కవితా నాయర్ మొదలైన వారు.
సంగీతం  :బిజిబల్  
ఛాయాగ్రహణం  : మధు అంబట్ 
ఎడిటర్ : విజయ్ శంకర్ 
రన్ టైమ్ :    124 నిముషాలు
 కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సలీమ్ అహమ్మద్  
విడుదల తేదీ : 28,ఆగస్ట్ 2020

Follow Us:
Download App:
  • android
  • ios