ఎంతకాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం, ఎన్ని సినిమాలు చేసాం అని కాదు...ఎంత గుర్తుండిపోయే పాత్రలు చేసాం అనేది ముఖ్యం. ఆ విషయం తెలిసిన ఆర్టిస్ట్ లు ఆచి,తూచి అడుగులు వేస్తారు. కెరీర్ ప్రారంభంలో వచ్చిన ప్రతీ అవకాసం వాడేసుకున్నా, ఆ తర్వాత నచ్చిన అవకాసం అందిపుచ్చుకుని ముందుకువెళ్తారు. ఇప్పుడు అలాంటి అరుదైన అదిరిపోయే ఆఫర్ ..అనసూయకు వచ్చిందని సమాచారం. ఆమె త్వరలో ‘దేవదాసి’గా కనిపించబోతోందిట. ఆ పాత్ర ఎంత గొప్పగా తీర్చిదిద్దారంటే ...సినిమాలో నటించే మిగతా స్టార్స్ కే అసూయ పుట్టే స్దాయిలో ఉందిట. దాంతో రెమ్యునేషన్ కూడా పట్టించుకోకుండా ఓకే చేసినట్లు సమాచారం. ఇంతకీ ఏ సినిమాలోదా పాత్ర..దర్శకుడు ఎవరూ అంటే...ఇంకెవరూ మన క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ. 
 
ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారులుగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రంగ మార్తాండ’. నానా పటేకర్‌ నటించిన మారాఠీ చిత్రం ‘నట సామ్రాట్‌’కు ఇది తెలుగు రీమేక్‌. ఈ సినిమాలో  అనసూయ దేవదాసిగా నటిస్తోందని సినీ వర్గాల సమాచారం. అయితే ఇప్పుడు దేవదాసి వ్యవస్ద లేదు. దేవదాసి అంటే.. గుడిలోనే ఉంటూ దేవుడి ఉత్సవాల్లో నాట్యం చేస్తూ జీవితాంతం అవివాహితగా ఉండే స్త్రీ. ఈ పాత్రలో అనసూయ నటిస్తోందట.  అంతేకాదు ఆమెపై గుడిలోనే ఓ ప్రత్యేకపాట కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇదే నిజమైతే అనసూయ కెరీర్ కు పెద్ద బ్రేక్ వచ్చినట్లే. 

వాస్తవానికి కృష్ణవంశీ సైతం ఇప్పుడు ఫామ్ లో లేరు. కానీ ఆయనకు నటీనటుల్లో ఉన్న టాలెంట్ ని బయిటకు తీయగలడనే పేరు ఉంది. దాంతో  పాత్ర విన్న వెంటనే అనసూయ ఓకే చేసిందని సమాచారం.  గతంలో సోనాలి బింద్రే, ఛార్మి, కాజల్ ...కృష్ణ వంశీ సినిమాల్లో నటించిన తర్వాత పూర్తి స్దాయి బిజీ అయ్యారు. 

మరో ప్రక్క ఈ సినిమాలో సింగర్ గా కనిపించబోతోంది శివాత్మిక.  ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణల కూతురి పాత్రలో కనిపిస్తారట శివాత్మిక. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. బ్రహ్మానందం విభిన్న పాత్రలో కనిపించనున్న   ఈ సినిమాను రెడ్ బల్బ్ మూవీస్, ఎస్వీఆర్ గ్రూప్, హౌస్‌ఫుల్ మూవీస్ బ్యానర్స్‌పై.. అభిషేక్ జవకర్, మధు కలిపు నిర్మించనున్నారు. ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతమందిస్తున్నారు.