బాలీవుడ్‌ బాద్‌షా అమితాబ్‌ బచ్చన్‌ (77)కు, ఆయన కుమారుడు అభిషేక్‌కు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. శనివారం సాయంత్రం అమితాబ్‌ బచ్చన్‌ ముంబైలోని నానావతి ఆస్పత్రిలోని రెస్పి రేటరీ ఐసోలేషన్‌ యూనిట్‌లో చేరారు. ఈ నేపధ్యంలో అమితాబ్ అభిమానులంతా ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పెద్ద వయస్సు కావటంతో రిస్క్ ఎక్కువ ఉంటుందని భావిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్దనలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో వారి ఆరోగ్య పరిస్దితి ఎలా ఉంది..హాస్పటిల్ వర్గాలు ఏమన్నాయో చూద్దాం. 

అమితాబ్‌ బచ్చన్‌, ఆయన తనయుడు అభిషేక్‌ బచ్చన్‌ల ఆరోగ‍్యం స్థిమితంగా ఉందని ముంబై నానావతి హాస్పిటల్‌ డాక్టలు వెల్లడించారు.   వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని,  వారికి పెద్దగా కరోనా చికిత్స అందించాల్సిన అవసరం లేదని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.  శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్న అమితాబ్‌ నాలుగు రోజుల క్రితం ఆస్పత్రికి వచ్చి, కరోనా పరీక్ష చేయించుకున్నారు. ఆ పరీక్ష ఫలితం శనివారం సాయంత్రం అందింది. ప్రస్తుతానికి ఆయనకు వెంటిలేటర్‌ను అమర్చలేదు.  

అమితాబ్‌ విషయంలో రెండు అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. ఒకటి ఆయన వయస్సు. రెండోది, ఆయన కాలేయ, ఉదర సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతుండటం. అయితే, సరైన వైద్య, చికిత్సలతో ఆయన త్వరగా కోలుకుంటారని విశ్వాసం ఉంది.

మార్చి 25న మొదలైన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ సమయం నుంచి ఆయన తన నివాసానికే పరిమితమయ్యారు. ఇటీవల తన ఇంట్లోనే కౌన్‌ బనేగా కరోడ్‌ పతి కార్యక్రమం ప్రమోషనల్‌ కాంటెంట్‌ తదితర ప్రాజెక్టులకు సంబంధించిన పనుల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన సిబ్బంది ద్వారానే ఆయనకు కరోనా వైరస్‌ సోకి ఉంటుందని భావిస్తున్నారు. ఆదివారం ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, కూతురు ఆరాధ్య బచ్చన్‌లకు కూడా పాజిటివ్‌ వచ్చినట్లు ప్రకటించాడు. వారు కూడా స్పీడుగా రికవరీ అవుతున్నట్లు తెలుస్తోంది.