శనివారం రాత్రి అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌ అంటూ వార్తలు రావటంతో బాలీవుడ్‌ సినీ పరిశ్రమ ఉలిక్కి పడింది. అభిమానులు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు అమితాబ్‌, అభిషేక్‌లు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్ స్వయంగా తన ట్విటర్‌ ద్వారా తనకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టుగా వెల్లడించారు. అభిషేక్‌ కూడా తనకు తన తండ్రికి కొద్ది పాటి లక్షణాలు ఉండటంతో టెస్ట్ చేయించకోగా పాజటివ్‌ వచ్చిందని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

ఈ నేపథ్యంలో అమితాబ్‌ను నానావతి హాస్పిటల్‌కు తరలించి ఐసోలేషన్‌లో ఉంచారు. తాజాగా అమితాబ్ బచ్చన్‌ నానావతి ఆసుపత్రి నుంచి రిలీజ్ చేసిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో అమితాబ్‌ బచ్చన్ నానావతి హాస్పటిల్‌ డాక్టర్స్‌, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు.

వీడియోలో బిగ్ బీ మాట్లాడుతూ... ఈ విపత్కర పరిస్థితుల్లో శక్తివంచన లేకుండా శ్రమిస్తున్న డాక్టర్లు, నర్సులు, స్టాఫ్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. మహమ్మారి ప్రభలుతున్న తరుణంలో తెల్ల కోటు వేసుకొని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శ్రమిస్తున్న డాక్టర్లు అంతా దేవుడి స్వరూపాలే అన్నాడు అమితాబ్‌. భయం అనేది ఎప్పుడూ ఉంటుంది. ఎవరూ భయపడవద్దు మనం ఈ విపత్కర పరిస్థితుల నుంచి త్వరలోనే బయట పడతాం అంటూ చెప్పాడు అమితాబ్‌.

 

అయితే ఈ వీడియోపై కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ వీడియో కరోనా పాజిటివ్‌ అని తేలిన తరువాత రికార్డ్‌ చేసిందేనా..? లేక గతంలో అమితాబ్‌ మరేదైనా సందర్భంలో రికార్డ్ చేసిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ తాజా వీడియో అయ్యుంటే అమితాబ్‌ స్వయంగా తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసేవాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.