కథేంటి
అరుణ్ ప్రసాద్ (కృష్ణస్వామి శ్రీకాంత్ అయ్యంగార్) కు కూతురు  అఖిల (శివశక్తి సచ్దేవ్) అంటే పిచ్చిప్రేమ. ఎంతలా అంటే రేపు పెద్దై ..ఆమె పెళ్లి చేసుకుని వెళ్లిపోతే ఎలా అని భయపడేటంత. ఆమె కూడా సేమ్ టు సేమ్. తండ్రి ని వదిలి అసలు ఉండలేదు.  అరుణ్ ప్రసాద్ కు తన కూతురు ఐఏఎస్ చేయాలని కోరిక. కానీ ఆమె ఇంజినీరింగ్ చేయాలని ఆశ. సర్లే అని కూతురు మాటకు గౌరవించి  కాకినాడ ఇంజినీరింగ్ కాలేజీలో చేర్పిస్తాడు.  కానీ హఠాత్తుగా అఖిల...ఐఏఎస్ చేయటానికి  హైదరాబాద్ వెళ్తుంది. అక్కడ అమర్ (విజయ్ రామ్) పరిచయం అవుతాడు. అఖిలతో ప్రేమలో అమాంతం పడిపోతాడు. అప్పుడు ఆమె తను అసలు ఎందుకు హైదరాబాద్ వచ్చిందో చెప్తుంది. తన వెనక పడద్దని సీరియస్ గా  వార్నింగ్ లా ఇస్తుంది.  తన వల్ల జరిగిన ఓ పెద్ద తప్పు వల్ల... తనకి, తన తండ్రికి మధ్య మాటలు లేవని చెప్పి షాక్ ఇస్తుంది. అసలు ఆమె జీవితంలో అంత పెద్ద తప్పు  ఏం జరిగింది. ఎందుకు ఆమె ప్రేమకు దూరంగా వెళ్తోంది. అంతగా ఇష్టపడే తండ్రి ఎందుకు ఆమెతో మాట్లాడటం మానేసాడు...ఇంజినీరింగ్ మానేసి అసలు ఆమె ఐఏఎస్ ఎందుకు చేస్తుంది? చివరకు అమర్ ప్రేమ కథ ఏమైంది..వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
   
ఎలా ఉంది..

నిజానికి ఇది మొదటే చెప్పుకున్నట్లు కొత్త ప్లాట్ కాదు..దాంతో ప్రెష్ నెస్ మిస్సైంది. అయితే దర్శకుడులో విషయం ఉంది. మేకింగ్ తో చాలా వరకూ కవర్ చేసుకుంటూ వచ్చారు.  అన్ని పాత్రలూ అప్ డేట్ గా అనిపిస్తాయి. కీలకమైన తండ్రి పాత్ర తప్ప. ఎందుకా పాత్ర ఇంకా అలాగే ఆలోచిస్తోంది.(ఈ పాయింట్ మీద వచ్చిన ఇన్ని సినిమాలు చూసాక కూడా..ఆయన చూడడేమో) అనే సందేహం వస్తుంది.  అలాగే ఈ లవ్ స్టోరీలో  హీరో హీరోయిన్ మధ్య ప్రేమ కథ కు మనం కనెక్ట్ కాలేము. కేవలం తండ్రి, కూతుళ్ల పాత్రలకే ప్రయారిటీ ఇస్తాం. అయితే ప్రేమ కథల్లో ఆ థ్రెడ్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలి.  

ఇక సినిమా ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూడాలనిపిస్తుంది. ఏమీ జరిగినట్లు ఉండదు. అలాగని ప్రక్కకు వెళ్లలేము..డైరక్టర్ తన మేకింగ్ తో కట్టిపారేస్తూంటాడు.  ఇంటర్వెల్ ట్విస్ట్...మనకు ఆర్య సినిమా ఇంటర్వెల్ గుర్తు చేసినా బాగుంటుంది.  సెకండాఫ్ లో డ్రామా బిల్డ్ అవుతుందనుకుంటే ఎమోషన్ డోస్ పెంచేసారు. 

ఇక అమర్ పాత్ర .. మ్యూజీషియన్  అవ్వాలని,బ్యాండ్ తో కలిసి ప్రాక్టీస్ చేస్తూంటాడు. అది కేవలం ఇంట్రో సాంగ్ కే పనికివచ్చింది.  మళ్లీ ఎక్కడా ఆ ప్రసక్తి రాదు..ఎండ్ క్రెడిట్స్ టైమ్ లో తప్ప. అలాగే అమర్ వెళ్లి  హీరోయిన్ తండ్రికు బుద్ది వచ్చే మాటలు చెప్తూంటే...మనకు అతి అనిపించకమానదు.

ఎవరెలా చేసారు..
హీరోయిన్ తండ్రిగా చేసిన శ్రీకాంత్ అయ్యంగార్ ఓ మెలోడ్రమిటక్ తండ్రిగా స్క్రిప్టు పరిధుల మేరకు బాగా చేసారు. ఇక హీరో విజయ్ రామ్ విషయానికి వస్తే..ఒకే ఎక్సప్రెషన్ సినిమా మొత్తం మానేజ్ చెయ్యటం మామూలు విషయం కాదు. దాన్ని అతను సాధించాడు. హీరోయిన్ శివ శక్తి బాగా చేసింది. సీనియర్ నటులు అన్నపూర్ణ, నరేష్ రు, అలాగే శతమానం భవతి మహేష్ వారి గురించి ప్రత్యేకించి చెప్పుకునేదేముంది.

టెక్నికల్ గా ..
తొలి చిత్రం దర్శకుడుగా జోనాధన్ ఎక్కడా అనిపించడు. చాలా అనుభవం ఉన్నట్లు నటీనటులను హ్యాండిల్ చేయటం, ఎమోషన్ సీన్స్ పండించటం, చక్కటి మేకింగ్ ప్లస్ లుగా నిలిచాయి. ఇక రసూల్ ఎల్లూరు సినిమాటోగ్రఫి డీసెంట్ గా ఉంది. రాధాన్ సంగీతం అతని గత సినిమాల స్దాయిలో లేదనే చెప్పాలి.  సినిమాని మరింత ట్రిమ్ చేసి రెండు గంటలుకు లాక్కొస్తే బాగుండేది.  డైలాగు రైటర్  కు  ప్రత్యేకమైన అభినందనలు చెప్పాలి. కొన్ని డైలాగులు పాత్రలు నోటి తో చెప్పినట్లు కాక మనస్సుతో చెప్పినట్లు అనిపించాయి.  అలాగే రామకృష్ణ.ఎస్ ఆర్ట్ వర్క్ మరింత హెల్ప్ అయ్యింది.
 
ఫైనల్ థాట్
కాలంతో పాటు సినిమాలో పాత్రలూ మార్చాలి..కష్టం అనుకుంటే  స్క్రిప్టుని పీరియాడిక్  గా మార్చేయాలి. 
రేటింగ్: 2.5/5
--సూర్య ప్రకాష్ జోశ్యుల

  ఎవరెవరు
నటీనటులు : కృష్ణస్వామి శ్రీకాంత్ అయ్యంగర్ , శివశక్తి సచ్దేవ్ ,  విజయ్ రామ్, నరేష్, అన్నపూర్ణ, శతమానం మహేష్ ,కేశవ్ దీపక్  తదితరులు.
సినిమాటోగ్రఫి : రసూల్ ఎల్లోర్
మ్యూజిక్ డైరెక్టర్: రధాన్ 
ఆర్ట్ : రామకృష్ణ.ఎస్ 
కథ,స్క్రీన్ ప్లే దర్శకత్వం : జోనాథన్ ఎడ్వర్డ్స్
నిర్మాతలు :  వి.ఇ.వి.కె.డి.ఎస్ ప్రసాద్, విజయ్ రామ్
Run Time: 2 గంటల 12 నిమిషాలు
విడుదల తేదీ: సెప్టెంబర్ 18, 2020
స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్:ఆహా