కథాంశం

తొమ్మిది తరగతిలోనే ప్రేమలో పడ్డ మగ జాతి ఆణిముత్యం సాయి శ్రీనివాస్‌ అలియాస్‌ శ్రీను (బెల్లంకొండ శ్రీనివాస్‌). అయితే ఆ అమ్మాయి  వసుంధర (అను ఇమ్మాన్యుయేల్‌) కొన్ని కారణాలతో మన హీరోని కాదనుకుని వెళ్లిపోతుంది. అవునంటే మరి ఏమయ్యాదో ..కానీ కాదనటంతో కథ ముందుకు నడిచింది. అప్పుటినుంచీ బాబుకి ..ప్రేమ అంటే అసహ్యం..అమ్మాయిలని నమ్మకూడదని, ఎవర్నీ ప్రేమించకూడని శపధం చేసుకుని, దాన్ని నెరవేర్చుకునే పనిలో బిజీగా ఉంటాడు. అయితే  కౌముది (నభానటేశ్‌) ని చూసాక తన నిర్ణయం మార్చుకుంటాడు. ఆమెతో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఫిక్సై ఆమె వెనకబడతాడు. అక్కడితో ఆగుతాడా..పది రోజుల్లో కౌముదిని ప్రేమలోకి దింపుతానని ఆమె తండ్రి జైపాల్‌ రెడ్డితో (ప్రకాశ్‌రాజ్‌) పనిమాలా ఛాలెంజ్‌ చేస్తాడు. ఈ క్రమంలో మరో ట్విస్ట్ రివీల్ అవుతుంది. కౌముది, వసుంధర అక్క చెళ్లిళ్లు అని తెలుస్తుంది. అలాగే గజ(సోనూసూద్‌)తో శ్రీనుకు ఉన్న వైరం రివీల్ అవుతుంది. ఆ వైరం ఏమిటి? శ్రీను లవ్ స్టోరీ ఎలా ముగిసింది..చివరకు ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  

విశ్లేషణ

ఈ కథ చదివితే మీకు కందిరీగ సినిమా గుర్తుకు రావటం ఖాయం. అలా రాలేదంటే అర్దం మీకు సినిమా జ్ఞాపక శక్తి తక్కువైనా ఉండాలి, లేదా కందిరీగ చూడకుండా అయినా ఉండాలి. అలా అప్పుడెప్పుడో వచ్చిన కందీరీగని  మళ్లీ కలుగులోంచి బయిటకు తీసి హీరోని మార్చి, మేకప్ చేసి వదిలినంత మాత్రాన సోల్ మాయమైపోతుందా..అలాగే అప్పటికీ ఇప్పటికీ జనం టేస్ట్ మారకుండా అలాగే ఉండిపోతుందా..డైరక్టర్ ఆ కథ దగ్గరే ఉండిపోయినా జనం ఆ తర్వాత చాలా సినిమాలు చూసేసి నాలెడ్జ్ పెంచేసుకుని అప్ డేట్ అయ్యిపోయారు. దాంతో ఈ సినిమా చూస్తూంటే ఎక్కడో,ఎప్పుడో చూస్తున్నట్లు అనిపిస్తూ,విసిగిస్తుంది. ఈ మధ్యకాలంలో హీరో ఒక ఇంట్లో సెటిల్ అయ్యి కామెడీ చేసే శ్రీను వైట్ల కామెడీలు తగ్గాయి. చక్కగా సమాధైపోయిన ఆ పార్ములా పశుపతిని మళ్లీ నిద్రలేపి జాగారణ పోగ్రాం పెట్టారు. ప్రకాష్ రాజ్, బెల్లంకొండ బాబు మధ్య వచ్చే కామెడీ చూస్తూంటే మనకు మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ లో మళ్లీ కందిరీగ సినిమా ఓపెన్ చేసి చూడాలనిపిస్తుంది. ఇక దెయ్యం కామెడీ సీన్స్ కు అయితే నిజంగానే హారర్ వచ్చేసి ఇంక ఈ సినిమా పూర్తవుదా ..ఈ సినిమా ఓటీటిలో ఎందుకు రిలీజ్ కాలేదు..చక్కగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ చూద్దము కదా అనే ఆవేదన తన్నుకొచ్చేస్తుంది. 

హెలెట్స్
ఈ సినిమా నిర్మాణ విలువలు
హోలా చికా సాంగ్

మైనస్ లు
 స్క్రిప్టు నుంచి హీరో గారి అతి విన్యాసాల దాకా బోలెడు

టెక్నికల్ గా 
బెల్లంకొండ శ్రీను మొదటి నుంచి క్లాస్లీ స్టారే. తన ప్రక్కన నటించే హీరోయిన్స్ నుంచి తన ఐటమ్స్ సాంగ్స్ దాకా అంతా భారీ బడ్జెట్లే. వాటి అండంతో మెల్లిగా అలవాటుపడ్డారు. అఫ్ కోర్స్ అతను కూడా నటన ప్రక్కన పెడితే డాన్స్ లు, ఫైట్స్ లకు అలవాటు పడ్డాడు. వాటిలో ఈజ్ వచ్చేసింది. సోనూసూద్, ప్రకాష్ రాజ్ లది రొటీన్ క్యారక్టరే, ఇక టెక్నికల్ గా మంచి టీమే ఉంది. డైరక్టర్ స్వతహాగా కెమెరామెన్ కాబట్టి ఆ డిపార్టమెంట్ మరీ బాగుంది. పాటల్లో ఐటం సాంగ్ తప్పించి మిగతావి దేవిశ్రీ రెగ్యులర్ ట్యూన్సే.  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.  సంతోష్ శ్రీనివాస్ పక్కా ఫార్ములా చిత్రాల దర్శకుడే కాదనలేం కానీ మరీ ఇంత అవుట్ డేటెడ్ కథాంశాలతో ముందుకు వస్తాడని అయితే ఊహించము. ఎడిటింగ్ ఈ గందరగోళానికి తగినట్లే ఉంది. రైటింగ్ డిపార్టమెంట్ బాగుంటే మిగతావన్నీ వాటంతట అవే సెట్ అయ్యేవి. 

ఫైనల్ ధాట్..
పండుగ రోజు అల్లుడు ..మరీ పాచి గా ఉంటాడనుకోలేదు

అది కందిరీగ..ఇది జోరీగ

--సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:1.5