ప్రభాస్‌ తన చేతిలో ఇప్పుడు మూడు భారీ చిత్రాలతో టాప్‌లో ఉన్నారు. అవి `రాధేశ్యామ్‌`, నాగ్‌ అశ్విన్‌ సైన్స్ ఫిక్షన్‌, ఓం రౌత్‌ `ఆదిపురుష్‌`. ఈ మూడూ పాన్‌ ఇండియా సినిమాలు. మూడు సినిమాల బడ్జెట్‌ కలిపి ఏకంగా వెయ్యి కోట్లు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ప్రభాస్‌ పేరుతో దాదాపు 1500 నుంచి రెండువేల కోట్ల బిజినెస్‌ ప్రత్యక్షంగా, పరోక్షంగా జరుగుతుంది.

ఇటీవల అందరిని సర్ప్రైజ్‌ చేస్తూ ప్రభాస్‌ `ఆదిపురుష్‌` చిత్రాన్నిప్రకటించారు. రామాయణం ప్రధానంగా తెరకెక్కే ఈ చిత్రానికి బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వం వహించనున్నారు. త్రీడీలో భారీగా దీన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో రాముడిగా ప్రభాస్‌ నటిస్తున్నారు. రావణుడిగా సైఫ్‌ ఎంపికైన విషయం తెలిసిందే. మిగతా కాస్టింగ్‌ ఎంపిక జరుగుతుంది.

ప్రభాస్‌ ఈ సినిమా ప్రకటనతో టాలీవుడ్‌ మెగా ప్రొడ్యూసర్‌కి మతిపోయింది. ఊహించిన అనౌన్స్ మెంట్‌తో కొన్ని రోజులు షాక్‌లోకి వెళ్లిపోయాడట. ఆ మెగా ప్రొడ్యూసర్‌ ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆయనే అల్లు అరవింద్‌. గతేడాది ఆయన `రామాయణ్‌` పేరుతో దాదాపు 500కోట్ల బడ్జెట్‌తో ఇంటర్నేషనల్‌ రేంజ్‌లో పౌరాణిక చిత్రాన్ని రూపొందించబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.  దీనికి నితీష్‌ తివారీ, రవి ఉద్యవార్‌ దర్శకత్వం వహిస్తారని, అల్లు అరవింద్‌, నమిత్‌ మల్హోత్రా, మధు మంతెనలు నిర్మిస్తారని ప్రకటించారు. 

ఓ వైపు ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్, ప్రీప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్‌-ఓం రౌత్‌ల నుంచి ఇదే సబ్జెక్ట్ తో సినిమా ప్రకటించడంతో అల్లు అరవింద్‌ అండ్ కో కి దిమ్మతిరిగినంత పనైంది. దీంతో ఇప్పుడు దైలామాలో పడ్డారు. ఇండియాలోనే తమది అతిపెద్ద సినిమాగా నిలవబోతుందని ఎన్నో కలలు కన్నారు. ఇప్పుడు అవన్నీ ఆవిరైనట్టేనా? అనే సందేశాలు వ్యక్తమవుతున్నాయి. 

అయితే `ఆదిపురుష్‌`లో ఏ కోణాన్నిఆవిష్కరించబోతున్నారు, అల్లుఅరవింద్‌ ప్లాన్‌ చేసిన రామాయణ్‌లోని కోణమేంటనేది తెలియాల్సి ఉంది. కథ ఒక్కటే అయినా యాంగిల్‌ డిఫరెంట్‌గా ఉంటే వర్కౌట్‌ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే అది కత్తిమీద సాములాంటిది. ఒకదాన్నిమించి మరోటి ఉండాలి. లేదంటే వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరులా మిగిలిపోతాయి. మరి `ఆదిపురుష్‌` ప్రకటనతో మెగా ప్రొడ్యూసర్‌ తమ కలల ప్రాజెక్ట్ విషయంలో ముందుకు సాగుతారా? లేక దాన్నిఇంతటితో ఆపేస్తారా? అన్నది పెద్ద సస్పెన్స్. దీనిపై ఎలాంటి ప్రకటన వస్తుందో చూడాలి.