అల్లు అర్జున్‌ ప్రస్తుతం టాలీవుడ్‌ టాప్‌ స్టార్స్ లో ఒకరు. స్టయిల్‌కి , అద్భుతమైన డాన్స్‌కి కేరాఫ్‌గా నిలుస్తున్నారు. సినిమాల్లో ఆయన పాత్రలు కాస్త అల్లరిగానే ఉంటాయి. అది ఆయన రియల్‌ మేనరిజాన్ని ప్రతిబింబిస్తుంటాయి. అయితే బన్నీ చిన్నప్పుడు మాత్రం బన్నీ అల్లరికి హద్దే లేదంటే అతిశయోక్తి కాదు. ఇది మనం చెప్పడం కాదు, ఏకంగా బన్నీ ఫాదర్‌, మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ స్వయంగా చెప్పారు.  

సమంత హోస్ట్ గా `ఆహా` ఓటీటీలో `సామ్‌ జామ్‌` అనే టాక్‌ షో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. న్యూ ఇయర్‌ కానుకగా అల్లు అర్జున్‌ పాల్గొన్న ఎపిసోడ్‌ ప్రసారం అవుతుంది. ఇందులో బన్నీ అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అయితే మధ్యలో ఇందులో నిర్మాత అల్లు అరవింద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమంత.. బన్నీని ఉద్దేశించి, `నాకు తెలిసి అల్లు అర్జున్‌ అంటే హార్డ్ వర్క్, డెడికేషన్‌.. `అంటూ పొగిడేసింది. చిన్నప్పుడు కూడా ఇలానే ఉండేవారా? అని అల్లు అరవింద్‌ని ప్రశ్నించగా, ఆయన దెండం పెట్టాడు. 

అంతటితో ఆగలేదు, బన్నీ అల్లరి ఏం రేంజ్‌లో ఉందో ఓ ఉదాహరణ చెప్పుకొచ్చాడు. ఇంటర్‌ చదివే టైమ్‌లో బన్నీకి మార్కులు చాలా తక్కువ వచ్చాయి. అన్ని సబ్జెక్ట్ ల్లో 20,  25 ఇలానే వచ్చాయి. బన్నీ మార్కులు చూసి ప్రిన్సిపాల్‌ అల్లు అరవింద్‌ని కలవమని చెప్పారట. ఆయన ప్రిన్సిపాల్‌ని కలిసేందుకు కాలేజ్‌కి వెళ్లాడట. ప్రిన్సిపాల్‌ బన్నీకి, తనకు క్లాస్‌ పీకుతాడని భావించాడట. కానీ అదేమీ జరగకుండా, మార్కులను పట్టించుకోవద్దని కూల్‌ చెప్పి తుస్సుమనిపించాడట. దీంతో అరవింద్‌ సైతం షాక్‌ కి గురయినట్టు చెప్పారు. 

మరి ఆ మధ్యలో ఏం జరిగిందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. అల్లు అరవింద్‌ ప్రిన్సిపాల్‌ దగ్గరకి వెళ్లకముందే.. బన్నీ వెళ్లి ప్రిన్సిపాల్‌కి ఒక వార్నింగ్‌ ఇచ్చాడట.  'మీకు ఒక కూతురు ఉండొచ్చు. ఆ అమ్మాయిని నేను లవ్‌ చేయవచ్చు. ఆ అమ్మాయి కూడా నాతో ప్రేమలో పడవచ్చు. ప్రేమించాక ఏదైనా జరగవచ్చు..' అని ప్రిన్సిపాల్‌కి బన్నీ వార్నింగ్‌ ఇచ్చాడట. అంతే.. ఆ ప్రిన్సిపాల్‌ బన్నీ వార్నింగ్‌కి భయపడి. తనతో ఏం చెప్పకుండా పంపించేశాడని చెప్పుకొచ్చాడు అల్లు అరవింద్‌. బన్నీలో రెబల్‌, కొంటే హీరో లక్షణాలు అప్పటి నుంచే డెవలప్‌ అయ్యాయని చెప్పుకోవచ్చు. బన్నీ స్నేహారెడ్డిని ప్రేమించి పెద్దల ఒప్పందంతో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.