స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా స్టార్ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్వకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకోగా రెండో షెడ్యూల్‌ కు కరోనా దెబ్బ కొట్టింది. దాంతో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడా అని అభిమానులు ఆలోచనలో పడిపోతున్నారు. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాని ఏప్రియల్ 28,2021న విడుదల చెయ్యాలని దర్శక,నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు మాచారం. వేసవి శెలవలు కలిసొస్తాయని మాత్రమే కాకుండా మెగా హిట్ సాధించిన బాహుబలి 2 సినిమా కూడా అదే తేదీన విడుదల అవటంతో , సెంటిమెంట్ గానూ కలిసొస్తుందని భావిస్తున్నారు.  దాంతో వచ్చే సంవత్సరం 2021 సమ్మర్ కు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి అంతటా టెన్షన్ పడటం లేదు టీమ్.

శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని సమాచారం. అయితే ఈ సినిమా టైటిల్‌పై సుకుమార్‌తో సహా చిత్ర యూనిట్‌ తెగ తర్జనభర్జన పడుతోందట. అయితే ఈ కథ ప్రధానంగా శేషాచలం అడువుల చుట్టూ సాగుతుండటంతో ‘శేషాచలం’అనే టైటిల్‌ సరిగ్గా ఆప్ట్‌ అవుతుందని ప్రచారం జిరగినా అందులో నిజం లేదని చిత్ర యూనిట్‌ చెప్తోంది. అయితే ఈ నెల 8న అల్లు అర్జున్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించే ఆలోచనలో ఉన్నారట చిత్రం టీమ్.

‘ఆర్య’(2004), ‘ఆర్య 2’ (2009) చిత్రాల తర్వాత దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా వైరస్‌ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ వాయిదా పడింది.