అల్లు అర్జున్ ప్రాజెక్టులు సెట్ చేసుకోవటంలో తగినంత నైపుణ్యం మొదటనుంచీ ప్రదర్శిస్తూ వస్తున్నారు. తన సినిమాల్లో లోకల్ కంటెంట్ ఉండేలే చూసుకుంటూనే మార్కెట్ విస్తృతికి ఎప్పటికప్పుడు కొత్త స్కెచ్ లు వేస్తున్నారు. మిగతా హీరోల కన్నా స్పీడుగా మార్కెట్ గ్రాబ్ చేసేందుకు అనువైన పద్దతులు అవలంభిస్తున్నారు. ఇప్పుడు కూడా తాజాగా అలాంటి మాస్టర్ ప్లాన్ తన తండ్రి అల్లు అరవింద్ సలహాతో వేస్తున్నట్లు సమాచారం. బాహుబలికి బాబులా ఉండే ఓ ప్రాజెక్టు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు లాక్ డౌన్ పీరియడ్ లో చర్చలు జరుపుతున్నాడని సమాచారం. ఇంతకీ ఏమిటా మాస్టర్ ప్లాన్...ఏ డైరక్టర్ తో ప్రాజెక్టుని మెటీరియలైజ్ చేయబోతున్నాడు అంటే...

బన్ని కు చాలా కాలంగా తమిళ మార్కెట్ పై దృష్టి ఉంది. అటు మళయాళ మార్కెట్ లో ఎలాగో క్రేజ్ ఉంది. అయితే తమిళంలో అడుగు పెట్టడం కుదరటం లేదు. ఈ నేపధ్యంలో తమిళ మార్కెట్ లో కు వెళ్లాలంటే ఓ పెద్ద తమిళ దర్శకుడుతో ముందుకు వెళ్లాలి. అందుకు దర్శకుడు శంకర్ కానీ మురగదాస్ కానీ, లింగు స్వామి కాని సరైన వాళ్లు అని వారి ఉద్దేశ్యం. అయితే మురగదాస్, లింగు స్వామిలతో సెట్ చేద్దామనుకున్నా వర్కవుట్ కాలేదు. దాంతో అల్లు అరవింద్ దృష్టి ఇప్పుడు శంకర్ పై పడింది. శంకర్ కూడా సరైన ప్రాజెక్టు చేతిలో లేక,తెలుగులో ఓ పెద్ద హీరోతో స్ట్రైయిట్ ప్రాజెక్టు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. 

ఈ క్రమంలో అల్లు అర్జున్, శంకర్ మధ్య చర్చలు మొదలయ్యాయి. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందించాలని అల్లు అరవింద్ ప్రపోజల్ కు అనుగుణంగా ఓ స్టోరీ లైన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ లాక్ డౌన్ లేకపోతే ఎదురు ఎదురు గా కూర్చుని చర్చలు జరిగేవి. అయితే మారిన పరిస్దితులకు అనుగుణంగా వీడియో కాల్ తో విషయాన్ని విశ్లేషిస్తున్నారు. ఎలా ముందుకు వెళ్లాలి..బన్ని మార్కెట్ కు ఎంతవరకూ బడ్జెట్ పెట్టచ్చు అనే విషయాలు పరిగణనలోకి తీసుకుని స్క్రిప్టు ఫినిష్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ కాంబినేషన్ గురించిన వార్త మనం వినచ్చు. శంకర్ ఇప్పుడున్న పరిస్దితుల్లో ఇది పెద్ద వరం అని చెప్పాలి.