బన్నీ ,సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం టైటిల్ ఎనౌన్సమెంట్ ఈ రోజే. ఈ నేపధ్యంలో  `పుష్ప` అనే టైటిల్ మీడియా ద్వారా తెరపైకి వచ్చింది.  ఈ సినిమాకు  కుమారి, గంగ అనే ఇంకో రెండు టైటిళ్లు ప‌రిశీలించి పుష్ప దగ్గర ఆగారు. అయితే ఇదేంటి ఇలాంటి టైటిల్ పెట్టారని బన్ని అభిమానులు సైతం సందేహం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ పేరు పుష్ప అయ్యి ఉంటుందని వార్తలు సైతం మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరో పేరే పుష్ప. అతని పూర్తి పేరు పుష్పక్ నారాయణ్.  అందరూ పుష్ప అని పిలుస్తారు. ఇక సినిమా ప్రారంభం నాటి నుంచీ ఈ సినిమాకు సింహాచలం, శేషాచలం అనే టైటిల్స్ వినపడ్డాయి. అయితే అవన్నీ కాదని సినిమా టీమ్ అఫీషియల్ కొట్టిపారేస్తూ ప్రకటన కూడా చేసింది. ఈలోగా టైటిల్ ని హీరోయిన్ పేరుతో ఉండబోతోందని, రెండు అక్షరాల టైటిల్ అని వార్త వచ్చింది. అంతేకాదు ఆ టైటిల్ పుష్ప అని మీడియాలో బలంగా వినిపిస్తోంది. అయితే ఇలాంటి టైటిల్ అల్లు అర్జున్ సినిమాకు పెడతారా అనే సందేహం మీడియాలో చాలా మందికి ఉంది. 

పుష్ప అనే టైటిల్ కనక పెడితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సాధారణంగా వెంకటేష్ సినిమాలకు ఇలాంటి టైటిల్స్ పెడుతూంటారు.  అయితే టైటిల్ తోనే ఏదో మ్యాజిక్ చెయ్యాలనే తపన సుకుమార్ ది. అందుకే ఆయన టైటిల్స్ విభిన్నంగా ఉంటాయి. రామ్ చరణ్ తో రంగస్దలం టైటిల్ కూడా అలాంటి చిత్రమైన మ్యాజిక్ చేసిందే. కాబట్టి ఇదే టైటిల్ ఫైనల్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

‘ఆర్య’(2004), ‘ఆర్య 2’ (2009) చిత్రాల తర్వాత దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.