సీతానగరం అనే ఊళ్లో ఉన్న గ్రామీణ బ్యాంక్ లో గోల్డ్ లోన్ సెక్షన్ లో పనిచేస్తూంటాడు భ‌వాని ప్రసాద్‌ (అల్లరి నరేష్‌‌). ఆ ఊరి దేవత మావుళ్లమ్మ. ఆమెని నమ్ముకున్నవాళ్లకి వెంటనే వివాహం అయిపోతుంది. కానీ భవానీ ప్రసాద్ అన్నలైన   (స‌త్యం రాజేష్‌, ప్రభాస్‌ శ్రీను)కు, తనకు పెళ్లి కావటం లేదు. అందుకు కారణం అమ్మవారికి తమ కుటుంబం చేసిన తప్పు వల్లే అని తన తాత (తణికెళ్ల భరణి) వల్ల తెలుసుకుంటాడు. ఆ తప్పేమిటంటే...కొన్ని అత్యవసర పరిస్దితుల్లో మెరుగుపెట్టమని ఇచ్చిన  అమ్మవారి నగలు అమ్మేసి, ఆమె మెళ్లో గిల్ట్ నగలు వేస్తాడు నరేష్ తాత. ఆ రహస్యం అలాగే ఉండిపోతుంది. కానీ తను అమ్మవారికి మోసం చేసాను అనే బాధ భరణిలో అలాగే ఉండిపోతుంది. ఈ విషయం తన మనవడైన అల్లరి నరేష్ కు చెప్పకుని,తను చనిపోయేలాగ అమ్మవారి మెళ్లో ఉన్న గిల్ట్ నగలు తీసేసి,ఒరిజనల్ పెట్టాలని ఉందని కోరుతాడు. దాదాపు వంద సవర్లం బంగారం అది. 

అంత డబ్బు ఎలా అని ఆలోచనలో ఉండగానే మరో ట్విస్ట్ వచ్చి పడుతుంది. ఆ దేవాలయాన్ని ఎండోమెంట్ వారు తీసేసుకుంటారని తెలుస్తుంది. అప్పుడు అమ్మవారికి సంభందించిన అన్ని అధికారికంగా గవర్నమెంట్ అధికారికి అప్పచెప్పాల్సి ఉంటుంది. అప్పుడు విషయం మొత్తం బయిటపడుతుంది. దానికి ఎంతో టైమ్ లేదు. ఏం చేయాలా ఆలోచించిన నరేష్ ఓ ప్లాన్ చేసి అమ్మవారు నగలు చేయించటం మొదలెడతాడు. అయితే ఆ ప్లాన్ బెడిసికొట్టి అతన్ని సమస్యల్లో పడేస్తుంది. ఆ ప్లాన్ ఏమిటి...అది ఎలా రివర్స్ అయ్యింది. చివరకు అమ్మవారు నగలు చేయించగలిగారా.. కనక మహాలక్ష్మి (పూజా జవేరి)తో ఎలా ప్రేమలో పడ్డాడు ? ఆమె అతని ప్రేమ కోసం ఏం చేసింది ? వంటి విషయాలతో  మిగతా కథ నడుస్తుంది.

 విశ్లేషణ

How to Steal a Million(1966) అనే సినిమాలోనూ ఇలాంటి పాయింటే ఉంటుంది. ఓ ఆర్ట్ గ్యాలరీలో ఉన్న పెయింటింగ్ నకిలీది. త్వరలో అక్కడ ఇన్సిపెక్షన్ జరగబోతోంది.  ఒరిజనల్ కాకుండా అక్కడ నకిలిదీ దొరికితే పెద్ద సమస్య. దాంతో నకిలీ పెయింటింగ్ లు తయారు చేసే వాళ్లు ఏం చేయాలనుకున్నారు..ఏం చేసారు అన్న పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది. అయితే అక్కడ వాళ్లు ఓ తెలివైన ఆలోచన చేస్తారు. ఆ ఆర్ట్ గ్యాలరీలో దొంగతనం జరిగితే సమస్య పరిష్కారం అవుతుంది. ఆ దొంగతనంలో తమ నకిలీది వెళ్లిపోతుంది కాబట్టి ఎవరూ పట్టుకోరు అని ప్లాన్ చేస్తారు. సినిమా మొత్తం ఫన్ తో నడిచిపోతుంది. అదే ఇక్కడ బంగారు బుల్లోడు దగ్గరకు వచ్చేసరికి..ఎత్తుగడ దాకా బాగుంది. అమ్మవారి గిల్ట్ నగలు తీసేసి ఒరిజనల్ పెట్టాలనే ఆలోచన దాకా ఫెరఫెక్ట్ గా ఉంది. అయితే అక్కడ నుంచే గాడి తప్పింది. హీరో అందుకోసం చేసే పనులు చాలా చిల్లరగా అనిపిస్తాయి. ఇక సెకండాఫ్ కు వచ్చేసరికి ఆ గుళ్లో దొంగతనం జరగటం వేరే వాళ్లు దొంగలని తేలటం వంటివి పెట్టి మరీ ఇబ్బందిగా ఉంటాయి. హీరోకు సంభందం లేకుండా చేసేసారు. హీరో తనకు వచ్చిన సమస్యను పరిష్కరించే క్రమంలో మరికొన్ని సమస్యల్లో పడాలి కానీ ..ఆ సమస్య తనంతట తానే హీరో ప్రమేయం లేకుండా జరిగిపోతే ఫలితం ఏముంటుంది. హీరో ప్యాసివ్ క్యారక్టరైజేషన్ అవ్వటం తప్ప. అలాగే కామెడీ సీన్స్ కూడా ఇరవై ఏళ్ల క్రితం సినిమాలు గుర్తు చేసాయి. మారిన కాలానికి తగినట్లుగా కామెడీ మారలేదు. ట్రెండీ జోక్స్ లేకపోతే ఈ కాలంలో కామెడీని పండించటం కష్టం. వాస్తవానికి అమ్మవారి గుడిలో దొంగతనం అనేది పాతకాలం కథ అనిపిస్తుంది కానీ..ఇప్పుడు గుడుల్లో దొంగతనాలు ,దాడులు జరుగుతున్న పరిస్దితుల్లో ట్రెండీ అనిపించుకునే అవకాసం ఉంది. అయితే ట్రీట్మెంట్ ఆ అవకాసం ఇవ్వలేదు. అసలు కథపై గ్రిప్ ఎప్పుడు పోయిందని అర్దమవుతుందంటే...జబర్దస్త్‌ని గుర్తు చేస్తూ గెట‌ప్ శీనుతో గెట‌ప్ వేయించి పెద్ద ట్రాక్ నడపటం దగ్గరే. 

టెక్నికల్ గా...

డైరక్టర్ గిరి...దర్శకత్వం అప్ డేట్ గా లేదనేది సినిమా ప్రారంభమైన పది నిముషాల్లోనే అర్దమయ్యే విషయం. అయితే కామెడీ పండి, డ్రామా ఎక్కితే అవన్ని గుర్తు రావు. స్క్రిప్టు డిజైనే ఫెయిల్ అవటంతో మిగతావి నప్పలేదనే పదే పదే గుర్తు వస్తుంది. ఎంతో గొప్పగా పబ్లిసిటీ చేసిన  ‘స్వాతిలో ముత్యమంత..’ పాట రీమిక్స్ కూడా అంతంత మాత్రమే. రీరికార్డింగ్ కూడా నీరసంగా ఉంది. సతీష్ ముత్యాల కెమెరా వర్క్ సైతం సినిమాని పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్లటానికి సాయం చేసింది.  వెన్నెల కిషోర్.. పోసాని కృష్ణమురళి వంటి వారు కామెడీ చేసినా పెద్ద నవ్వించలేదు. అజయ్ ఘోష్ పోలీస్ అధికారిగా బాగా చేసారు. అల్లరి నరేష్ లో మునపటి జోష్ అయితే మిస్సైంది. హీరోయిన్ గురించి మాట్లాడుకునేందుకు ఏమీ లేదు. వెలగొండ శ్రీనివాస్ డైలాగులు మాత్రం ఉన్నంతలో బాగున్నాయి. కొన్ని చోట్ల బాగా పేలాయి. ఎడిటింగ్ సోసోగా ఉంది.

ఫైనల్ థాట్
మెరిసేదంతా బంగారం కాదు..నరేష్ చేసేవన్నీ కామెడీ సినిమాలూ కాదు
Rating:2
---సూర్య ప్రకాష్ జోశ్యుల

ఎవరెవరు..

న‌టీన‌టులు: అల్లరి నరేష్‌,, పూజా ఝ‌వేరి, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్‌, వెన్నెల‌ కిషోర్‌, రాజేష్‌, పృథ్వీ తదిత‌రులు

సంగీతం: సాయి కార్తీక్

కూర్పు‌: ఎం.ఆర్‌.వర్మ

ఛాయాగ్రహ‌ణం: సతీష్‌ ముత్యాల‌

నిర్మాత: సుంకర రామబ్రహ్మం

రచన, దర్శకత్వం: గిరి పలిక

విడుదల‌ తేదీ: 23-01-2021

సంస్థ‌: ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్