కథేంటి

మార్బుల్ బిజినెస్ చేసే.. దెయ్యాలన్నా, భూతాలన్నా నమ్మకం లేని అసిఫ్(అక్షయ్ కుమార్)బిందాస్ లైఫ్ ని లీడ్ చేస్తూంటాడు. మూఢ విశ్వాసాలపై పోరాటం చేస్తూ.. దెయ్యాలు ఉన్నాయని నిరూపిస్తే గాజులు తొడుక్కుంటానని సవాల్‌ విసురుతూంటాడు. అతను ఓ  హిందూ అమ్మాయి రష్మీ(కియారా అద్వానీ)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అది ఆమె పెద్దలకు ఇష్టం ఉండదు.దాదాపు మూడేళ్ల తర్వాత తల్లిదండ్రుల సిల్వర్ జూబ్లీ పెళ్లి రోజు సెలిబ్రేషన్స్ కు రష్మి తల్లి ఫోన్ చేస్తుంది.  అల్లుడితో కలిసి ఇంటికి రమ్మని చెబుతుంది.దాంతో ఆనందంతో ఆసిఫ్‌ తన భార్యను తీసుకుని అత్తారింటికి వస్తాడు. అయితే ఇప్పటికీ రష్మి తండ్రి ఆసిఫ్‌పై కోపంతో ఉంటాడు. 

ఆ విషయాన్ని ప్రక్కన పెట్టి ..ఒకరోజు కాలక్షేపానికని చుట్టు పక్కల ఉన్న పిల్లలందితో కలిసి క్రికెట్‌ ఆడేందుకు సిద్ధమవుతాడు. ఆసిఫ్‌ వారిని తీసుకుని ఒక ఖాళీ ప్లేస్ కు తీసుకు వెళ్తాడు. అయితే  ఆ ప్లేస్ లో శవాన్ని పాతి పెట్టారని తెలియక వికెట్లు పాతుతాడు. దీంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోవటం...భయంతో పిల్లలు పారిపోవటం జరుగుతుంది. ఆ తర్వాత ఆ వికెట్లను తీసుకుని ఇంటికి వచ్చిన ఆసిఫ్‌కు కుళ్లు వాసన రావడంతో నిమ్మగడ్డి ఉన్న కుండీలో వాటిని ఉంచి నీటితో శుభ్రం చేస్తాడు. అప్పటి నుంచి ఆసిఫ్‌ అత్తారింట్లో రోజుకో రకంగా వింతలు మొదవుతాయి. ఇంట్లో ఎవరో ఏడుస్తుండటం, తిరుగుతుండటం వంటివి జరుగుతుంటాయి. 

అక్కడితో ఆగకుండా ఒకరోజు ఆ నిమ్మగడ్డితో కాచిన టీని ఆసిఫ్ తాగుతాడు. అప్పటి నుంచి ఆసిఫ్‌ మహిళలా ప్రవర్తించటం మొదలెడటాడు. దీంతో ఆసిఫ్ కి దెయ్యం పట్టిందని ఫ్యామిలీ ఫిక్స్ అవుతారు. ఇంతకీ ఆసిఫ్‌కు పట్టిన ‘లక్ష్మి’(శరద్‌ ఖేల్కర్‌)ట్రాన్స్‌జెండర్ ఆత్మ కథ ఏంటి? ఇంతకీ అసలు లక్ష్మీ ఎవరు.? ఆమెకు జరిగిన అన్యాయం ఏంటి.? ఎవరు చేశారు.?   చివరకు ఆ దెయ్యం ఆసిఫ్‌ను వదిలి పెట్టిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
 
 
ఎలా ఉంది

ఇలాంటి పాత్రలు చేయటం అక్షయ్ కు కొత్తేమీ కాదు. అలవోకగా అల్లుకుపోగలడు. అయితే అదే కొంపముంచింది. అక్షయ్ కొత్తగా అనిపించలేదు. అదే అల్లరి..అదే హంగామా చేసాడు. అయితే అంతలా నవ్వించలేకపోయాడు. తెలుగు కాంచన చూసిన వాళ్లకు లారెన్స్ చాలా హైలో ఉన్నట్లు అనిపిస్తుంది. అదే సమయంలో తెలుగు లేదా తమిళ వెర్షన్ కు వచ్చేసరికి శరత్ కుమార్ ...హిజ్రా పాత్రలో విశ్వరూపం చూపించారు. అయితే అక్షయ్ ఆ స్దాయి చూపించలేకపోయారు. అలాగే బాగా ఓవర్ అనిపించినా లారెన్స్ కామెడీ నవ్విస్తుంది. మోటుగా కనిపించినా మన చంకల్లో కితకితలు పెట్టాల్సిన అవసరం లేకుండా కవ్విస్తుంది. ఇక్కడ హిందీకు వచ్చేసరికి ఆ కామెడీ సీన్స్ అన్నీ కట్టకట్టుకుని తేలిపోయాయి. అసలు హిందు అమ్మాయి, ముస్లిం అబ్బాయి కాన్సెప్ట్‌ గా మార్చేసి కామెడీ చేయడానికి చేసిన ప్రయత్నమే  బెడిసికొట్టింది. ఒరిజనల్ లోని సీన్స్ ను చాలా వరకు పక్కన పెట్టేసి బాలీవుడ్ స్టయిల్లో ప్రయత్నించారు కానీ.. ఆ అవన్నీ తేలిపోయాయి. అవన్నీ ఒకెత్తు అయితే హార్రర్ సీన్స్ లో కూడా ఒరిజినల్లో ఉన్న ఇంపాక్ట్ లేదు. విలన్ పాత్రలో వీరోచితం లేదు.ప్యాసివ్ క్యారక్టర్ గా ప్రక్కకు తప్పుకుంది. అయితే లాస్ట్ అరగంట మాత్రం అందుకు మినహాయింపు. నిర్మాతకు ‘లక్ష్మి’ తెచ్చిపెట్టగలిగేది ఈ భాగమే.ఏదైమైనా ఎదురుచూసి చూసేటంత గొప్ప దీపావళి ట్రీట్ మాత్రం కాదు. బాంబు పేలలేదు.  

అక్షయ్,మిగతావాళ్లు ఎలా చేసాడంటే..
మొదటే చెప్పుకున్నట్లు అక్షయ్ కు ఇలాంటి పాత్రలు పరమరొటీన్ వ్యవహారం. దాంతో అలవోకగా చేసుకుపోయాడు. అయితే అక్షయ్ తప్పించి వేరే వాళ్లు చేసినా ఆ కిక్ కూడా రాదనేది నిజం. అటు అసిఫ్‌గా.. ఇటు ట్రాన్స్‌జెండర్ లక్ష్మీగా అక్షయ్ కుమార్ తనదైన స్టైల్ తో దుమ్మురేపారు. ముఖ్యంగా ఆత్మ ఆవహించినప్పుడు అక్షయ్ పలికించిన ఎక్సప్రెషన్స్ పరిణితి ఉన్న నటుడుని ఆవిష్కరిస్తాయి. ఈ సినిమాను అంతా తానై భుజాన మోసారు. అదే సమయంలో స్టార్ హీరోగా వెలుగుతున్న సమయంలో ఇలాంటి ట్రాన్స్‌జెండర్ సబ్జెక్ట్‌ను ఎంచుకోవడం నిజంగా సాహసమే. ఇక హీరోయిన్ కియారా అద్వానీ లెంగ్త్ తక్కువే అయినా బాగానే లాక్కెళ్లింది. ముఖ్యంగా బుర్జ్ ఖలీఫా సాంగ్‌లో అయితే కుర్రాళ్లకు గాలం వేసింది. ఇక లక్ష్మీ పాత్రలో శరద్ కేల్కర్ మంచి నటనకనపరిచారు.  

 టెక్నికల్ గా ..
 అనూప్‌ కుమార్‌, అమర్‌ మోహిల్‌ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పళణి స్వామి సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్సైంది. పాటలు బాగున్నాయి. అదే సమయంలో భయపెట్టే సన్నివేశాలను కొన్ని తేలిపోయాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.  దర్శకుడు రాఘవ లారెన్స్‌ ఫస్టాఫ్ లో కథా నేపథ్యాన్ని మార్చడంతో పాటు, ‘కాంచన’లో ఉన్న అతి అరవ కామెడీ పెట్టలేదు. 

ఫైనల్ థాట్..
 'కాంచన' హిందీ రీమేక్ కన్నా తెలుగు డబ్బింగే బాగుంది.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2

----

ఎవరెవరు

నటీనటులు: అక్షయ్‌కుమార్‌, కియారా అడ్వాణీ, శరద్‌ ఖేల్కర్‌ తదితరులు
సంగీతం: తనిష్‌ బాగ్చి, శశి-ఖుషి
నేపథ్య సంగీతం: అనూప్‌ కుమార్‌, అమర్‌ మోహిల్‌
సినిమాటోగ్రఫీ: పళణిస్వామి, ఖుష్‌ చబ్రియా
ఎడిటింగ్‌: రాజేశ్‌పాండే
నిర్మాత: తుషార్‌కపూర్‌, షబీనాఖాన్‌, ప్రఫుల్‌ సాలుంకే, సంపత్‌, యోగిరాజ్ ‌శెట్టి, రవీంద్ర ఠాకూర్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాఘవ లారెన్స్‌
బ్యానర్‌: ఫాక్స్‌ స్టూడియోస్‌
విడుదల: 09-11-2020
ఓటీటి:డిస్నీ+హాట్‌స్టార్‌..