తమిళనాట అజిత్ కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రజనీకాంత్,విజయ్ ఫ్యాన్స్ కు పోటా పోటీగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూంటారు. అయితే ఆ అభిమానుల్లో ఆందోళన నెలకొనింది. అందుకు కారణం అజిత్, శాలినీ ఇద్దరూ చెన్నైలోని అపోలో హాస్పటిల్ లో మాస్క్ ల తో కనపడటమే కారణం. వీళ్లద్దరూ హాస్పటిల్ కు వెళ్లి వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  తమిళనాట కరోనా వైరస్‌ భయంకరంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ముఖానికి మాస్క్‌లతో అజిత్‌ ఆస్పత్రికి వెళ్లడం ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.  

దీనికి తోడు ఈ విషయమై మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతోంది. అజిత్‌ తండ్రి కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారని.. ఆయన్ను పరామర్శించడానికే అజిత్, షాలిని దంపతులు వెళ్లారని అందులో ఓ ప్రచారం ప్రధానంగా నడుస్తోంది. మరో ప్రక్క అజిత్‌కు ఆ మధ్య ఆపరేషన్  జరిగిందని, దీంతో ప్రతి మూడు నెలలకు ఒకసారి టెస్ట్ ల నిమిత్తం ఆస్పత్రికి వెళుతుంటారని, అందులో భాగంగా అజిత్, తన భార్యతో కలిసి చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారని  కొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయమై అజిత్ కు చెందిన వారు కానీ, అజిత్ కానీ వివరణ ఇస్తే బాగుండేది.  

అజిత్‌ ప్రస్తుతం వలిమై చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. లాక్‌ డౌన్‌ కారణంగా చిత్ర షూటింగ్‌ నిలిచిపోవడంతో అజిత్‌ ఇంట్లోనే ఉంటున్నారు. హ్యూమాఖురేషీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. దీనికి హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అజిత్‌ పోలీసు అధికారిగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ దాదాపు పూర్తి కావచ్చింది. దీంతో అజిత్‌ కొత్త చిత్రానికి సిద్ధమవుతున్నారు.

 కాగా, ఇటీవల  సూర్య హీరోగా సూరైర్‌ పోట్రు చిత్రాన్ని తెరకెక్కించిన మహిళా దర్శకురాలు సుధాకొంగర దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం జరిగింది. తాజాగా,  అజిత్‌ తో కొత్త చిత్రానికి చిరుతై శివ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జోరందుకుంది. వీరి కాంబినేషన్‌ లో ఇంతకు ముందు వేదాళం, వీరం, వివేకం, విశ్వాసం ఇలా నాలుగు హిట్‌ చిత్రాలు రూపొందిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ కాంబో అయిదో చిత్రానికి సిద్ధమవుతోంది. ఇది చారిత్రక కథాంశంతో తెరకెక్కబోతుందని తెలిసింది. దీనికి ఓ ప్రముఖ రచయిత కథను తయారు చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది.