బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అందాల రాశి ఐశ్వర్య రాయ్‌ కరోనాతో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ అని నిర్థారణ కావటంతో బాలీవుడ్‌ సినీ పరిశ్రమ ఉలిక్కి పడింది. అమితాబ్‌ తో పాటు ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌కు, అభిషేక్‌ భార్య ఐశ్యర్య రాయ్‌, కూతురు ఆరాధ్యలకు కూడా పాజిటివ్ వచ్చింది. అయితే అమితాబ్‌, అభిషేక్‌లు తొలి రోజు నుంచే నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఐశ్వర్య, ఆమె కూతురు కొద్ది రోజులు హోం క్యారెంటైన్‌ తరువాత ఆసుపత్రిలో చేరారు.

అయితే పదిరోజుల హాస్పిటలైజేషన్‌ తరువాత ఐశ్వర్య రాయ్‌, ఆరాధ్యకు నెగెటివ్ వచ్చింది. ఈ విషయాన్ని అభిషేక్‌ బచ్చన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. `మా కోసం ప్రార్థనలు చేసిన మీ అందరికీ శుభాకాంక్షలు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. దేవుడి దయతో ఐశ్వర్య రాయ్‌, ఆరాధ్యలకు నెగెటివ్‌ వచ్చింది. హాస్పిటల్‌ నుంచి కూడా డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం వాళ్లు ఇంట్లోనే ఉంటున్నారు. నేను నా తండ్రి ఇద్దరం హాస్పిటల్‌లోనే వైద్య సిబ్బంది సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నాం` అంటూ ట్వీట్ చేశాడు అభిషేక్‌.

ఇటీవల అమితాబ్‌ బచ్చన్‌కు నెగెటివ్‌ వచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. అమితాబ్‌ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని, త్వరలోనే డిశ్చార్జ్‌ అవుతున్నారంటూ ప్రచారం జరగటంతో ఆ వార్తలపై బిగ్ బీ స్వయంగా స్పందించాడు. అవన్నీ రూమర్స్‌ అంటూ కొట్టి పారేసిన అమితాబ్‌, రూమర్స్‌ నమ్మవద్దంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.